
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు OnePlus కి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి OnePlus ఎంతగానో చేరువైంది. ఈ సంస్థ ఫోన్లకు చాలా గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ ని కష్టాలు చుట్టుముట్టాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఇకపై OnePlus విక్రయాలు జరగబోవని తెలుస్తోంది. 2024 మే 1 నుంచి రిటైల్ స్టోర్స్ మరియు మొబైల్ షాపుల్లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం పదండి.
మే 1 నుంచి OnePlus అమ్మకాల నిలిపివేత
రిటైల్ స్టోర్స్ లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఇకపై OnePlus ఉత్పత్తులను విక్రయించబోమని సదరు సంఘం తెలిపింది. ఓఆర్ఏ అసోషియేషన్ దీనిపై, వన్‌ప్లస్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రజనీశ్ సింగ్ కి ఒక లేఖ రాశారు. మే 1 నుంచి వన్‌ప్లస్ ఫోన్లను విక్రయించమని లేఖలో పేర్కొన్నారు.
ఆఫ్‌లైన్ మార్కెట్ లో OnePlus అమ్మకాలు ఎందుకు నిలిచిపోనున్నాయి?
మీడియా రిపోర్ట్ ప్రకారం, రజనీశ్ సింగ్ కి రాసిన లేఖలో ఓఆర్ఏ అసోషియేషన్ తాము ఎదుర్కుంటోన్న సమస్యలను గురించి ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూడండి.
లో-ప్రాఫిట్ మార్జిన్స్ వల్లన షాపు యజమానులు నష్టపోతున్నట్లు అసోసియేషన్ చెబుతోంది. వన్‌ప్లస్ ఉత్పత్తులపై తక్కువ లాభం ఉంటోందని రిటైలర్స్ సంఘం వాదిస్తోంది.
OnePlus పాలసీపై కూడా అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యారంటీ మరియు సేవల జాప్యంతో షాపు యజమానులు మరియు రిటైలర్స్ కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తోందని తెలిపింది.
వన్‌ప్లస్ రవాణా నిర్వహణ విధానంపై కూడా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
OnePlus ఫోన్లు ఎక్కడ అమ్మబడవు?
దేశంలోని సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) పరిధిలో ఉన్న దాదాపు 4500 స్టోర్లలో OnePlus ఫోన్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.
పూర్వికా మొబైల్స్, సంగీత మొబైల్స్, బిగ్ సీ మరియు పూజ వంటి దిగ్గజ రిటైల్ స్టోర్స్ లో వన్‌ప్లస్ సేల్స్ మే 1 నుంచి జరగబోవు.
అసోసియేషన్ విధించిన వన్‌ప్లస్ అమ్మకాల నిషేధం ప్రధానంగా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో పాటు మహారాష్ట్ర మరియు గుజరాత్ లపై ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లో OnePlus సేల్స్ నిలిచిపోనున్నాయి. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్ ఫోన్లను కొనాలని భావిస్తోన్న వినియోగదారులు నిరాశ చెందక తప్పదు.
సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకు OnePlus నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం శోచనీయం. వన్‌ప్లస్ ఏ విధంగా స్పందించనుందో చూడాలి.












