హైలైట్స్:
- కొత్త బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఓలా మాజీ ఉద్యోగులు, ఫైర్ సేఫ్టీ బ్యాటరీని అందించవచ్చని ప్రకటన
- కొత్త టెక్నాలజీలో వాడబడిన ఓ రకం ద్రావకం, బ్యాటరీ ప్యాక్ పై సమానంగా వేడిని డిస్ట్రిబ్యూట్ చేయనున్న లిక్విడ్
- బ్యాటరీ వేడిని ముందుగానే పసిగట్టనున్న కొత్త బ్యాటరీ టెక్నాలజీ
ఇద్దరు ఓలా ఎలక్ట్రిక్ మాజీ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఎదుర్కుంటోన్న ఫైర్ ఇష్యూస్ కి సొల్యూషన్ కనిపెట్టారు. ఓలా మాజీ ఉద్యోగులు నెలకొల్పిన EMO అనే బెంగళూరుకి చెందిన స్టార్టప్ ఈ కొత్త రకం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి పరిచినట్లు ప్రకటించింది. వీరు కనిపెట్టిన టెక్నాలజీ బ్యాటరీ నిప్పంటుకోకుండా చూడమే గాక, బ్యాటరీ లైఫ్ ని కూడా పెంచుతుందని కంపెనీ వారు చెబుతున్నారు. ఇంకా వీరు ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందాల్సి ఉంది. గత మూడు నెలలుగా విభిన్న పరిస్థితుల నడుమ ఈ టెక్నాలజీపై ప్రయోగాలు జరిపి ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని వ్యాలిడేట్ చేశారు.
ఇటీవలి కాలంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లు నిప్పంటుకున్న ఉదంతాలు చాలా చూశాం. దీని వల్లన ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. బ్యాటరీలో మంటలు చెలరేగడం ప్రధానంగా అన్నింటికి కారణమని విచారణల్లో తేలుతోంది. ఇక రీసెంట్ గా సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వెహికిల్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, బ్యాటరీకి ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి. లేదంటే, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
ఫైర్-ప్రూఫ్ బ్యాటరీ?
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న EMO స్టార్టప్ ని రాహుల్ పటేల్, శీతాన్శు త్యాగి నెలకొల్పారు. వీరిప్పుడు తమ వద్ద బ్యాటరీ ఫైర్స్ కి సొల్యూషన్ ఉందని చెబుతున్నారు. ఇదివరకు వీరిద్దరు కూడా ఓలా ఎలక్ట్రిక్ సంస్థలో బ్యాటరీ విభాగంలో పని చేశారు. సన్ మొబిలిటీ సంస్థలో థర్మల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసిన అనుభవం రాహుల్ పటేల్ సొంతం. ఇక త్యాగి విషయానికి వస్తే, ఇతడు ఏథర్ ఎనర్జీ సంస్థలో డిజైన్ మరియు మానుఫాక్చరింగ్ విభాగంలో పని చేశాడు.
వీరి కొత్త డిజైన్ లో ఒక ప్రత్యేకమైన ద్రావకం హీట్ ని ఒడిసిపట్టుకుని, బ్యాటరీ ప్యాక్ పై సమానంగా ప్రసరింపజేస్తుంది. ప్రస్తుతం రాహుల్, త్యాగి ఆ ప్రత్యేక ద్రావకం పై పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మెషీన్ లెర్నింగ్ ఆధారిత బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ పై వీరి లేటెస్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. ఈ సిస్టమ్ అనేది బ్యాటరీ లోని విభిన్న సెల్స్ యొక్క ఉష్ణోగ్రత, పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటుంది. పంపింగ్ సిస్టమ్, ఓవరాల్ బ్యాటరీ డిజైన్ కి పేటెంట్స్ వస్తాయని ఈఎంవో కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈఎంవో క్లెయిమ్ చేస్తున్నవి ఇంకా నిరూపించబడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ 30 యూనిట్స్ పై తమ ప్రయోగాలు జరిపింది. అలాగే తమ టెక్నాలజీపై సదరు కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది.
టూ-వీలర్, త్రీ-వీలర్ ఈవీ సెగ్మెంట్ కి సేవలు అందించడంతో పాటు, కార్లు, ట్రక్కులు తదితర వాహనాలకు తమ సేవలను విస్తరించాలని ఈఎంవో యోచిస్తోంది. భవిష్యత్తులో తమ బ్యాటరీల్లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని జొప్పించాలని ఈఎంవో ప్లాన్ చేస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ కంపెనీలకు, ఈ-వెహికిల్స్ తయారీదారులకు భవిష్యత్తులో ఈఎంవో సంస్థ ఇండిపెండెంట్ సప్లయ్యర్ గా మారనుండే అవకాశం ఉంది.












