హైలైట్స్:
- దాదాపు అన్ని సైకిళ్ళకు సరిపోయే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ని రూపొందించిన ఢిల్లీకి చెందిన గురుసౌరభ్ సింగ్
- కిట్ రేంజ్: 40 కిలోమీటర్లు, టాప్ స్పీడ్: 25 కేఎంపీహెచ్
- రిక్షాలు, సైకిళ్ళు తదితర ఎన్నింటికో అమర్చుకోదగిన తేలికైన బోల్ట్-ఆన్ కిట్
ఢిల్లీకి చెందిన గురుసౌరభ్ సింగ్ ఒక ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ని తయారు చేశారు. దీని సాయంతో ఏ సైకిల్ నైనా 30 నిమిషాల్లోపు ఎలక్ట్రిక్-పవర్డ్ బైసైకిల్ గా మార్చేయవచ్చు. ఇన్నోవేటర్ గురుసౌరభ్ సింగ్ ఒక వినూత్నమైన బోల్ట్-ఆన్ డివైజ్ ని రూపొందించి, ఎంతోమంది భారతీయుల ప్రయాణ కష్టాలను తీర్చారు. సైకిళ్ళనే నమ్ముకుని జీవితం వెల్లదీస్తోన్న వారికి సింగ్ కనిపెట్టిన డివైజ్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ కిట్ కి ధృవ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ అని పేరు పెట్టారు. అలాగే ఈ కిట్ ని అమర్చుకునేందుకు ఎటువంటి ముందస్తు ఫ్యాబ్రికేషన్ పని అక్కర్లేదు. భారతదేశ వ్యాప్తంగా లభ్యమవుతున్న అన్ని రకాల సైకిళ్ళకు ఈ కిట్ సరిపోతుంది.
ఓ సైకిల్ కి ఈ కన్వర్షన్ కిట్ ని బిగించినప్పుడు, రైడర్ దీని సాయంతో దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలడు. ఇక దీని స్పీడ్ లిమిట్ 25 కేఎంపీహెచ్. లో-స్పీడ్ వెహికిల్ కావున, కన్వర్షన్ చేసుకున్నందుకు వెహికిల్ రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు.
అన్ని సైకిళ్ళకు సరిపోయే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ని రూపొందించిన ఢిల్లీ వ్యక్తి
అన్ని సైకిళ్ళు, ట్రై-సైకిళ్ళు, రిక్షాలు, వికలాంగులు వినియోగించే మొబిలిటీ అసిస్ట్ సైకిల్ కి కూడా తాను రూపొందించిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ని బిగించుకోవచ్చని సింగ్ చెబుతున్నారు. బోల్ట్-ఆన్ అరెంజ్మెంట్ వల్లన, బిగించడానికి ముందు ఎటువంటి ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉండదని సింగ్ అంటున్నారు. డోనర్ వెహికిల్ పై ఈ కిట్ ని కేవలం 20 నిమిషాల్లోనే బిగించవచ్చని సింగ్ చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి సింగ్ రూపొందించిన కిట్ ఎంతో ఉపయుక్తం కానుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా 4 కి.మీ నుంచి 5 కి.మీ పరిధిలోనే సైకిళ్ళపై తిరుగుతుంటారు. అటువంటి వారికి ఈ కిట్ వరం లాంటిదని చెప్పవచ్చు. అయితే మ్యాజిక్ ఏంటంటే, ఈ కిట్ సింగిల్ చార్జ్ పై 40 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. అలాగే కేవలం 25 కేఎంపీహెచ్ వేగాన్ని కలిగి ఉండటంతో, దీనికి వెహికిల్ రిజిస్ట్రేషన్ వంటి తలనొప్పులు ఉండవు. ఇకపోతే, ఈ కిట్ 170 కిలోల మోత సామర్థ్యం కలిగి ఉంది.
గత ఫిబ్రవరిలో నెట్టింట్లో ప్రత్యక్షమైన ఈ కిట్ వీడియో, ఆనంద్ మహింద్రా ట్వీట్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఈ కిట్ ని జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గురుసౌరభ్ సింగ్ ఆసక్తి చూపుతున్నారు. అలాగే కిట్ ధరను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు తన బృందంతో కలిసి సింగ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. సరైన ధరలో లభిస్తే, ఇటువంటి కిట్ భారతదేశ ప్రజల్లో ఆదరణ పొందే అవకాశాలున్నాయి. మరి గురుసౌరభ్ సింగ్ ఆవిష్కరణ ప్రజలకు అత్యంత త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. ఆయనకు ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు లభించాలని కోరుకుందాం.
లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.