హైలైట్స్
- పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్, పేలిన బ్యాటరీ
- ఒడిషాలో చోటు చేసుకున్న ఘటన, పేలుడు దాటికి దగ్ధమైన బండి
- ఒడిషా బైట్స్ యూట్యూబ్ చానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన

ఒడిషా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీ పేలుడు ప్రభావంతో స్కూటర్ కి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో సంబంధిత వీడియో సోషల్ మీడియాకి చేరింది. మంటల దాటికి స్కూటర్ నుంచి రికవర్ చేయడానికి ఏమీ మిగలలేదు.
ఒడిషా సోనేపూర్ లోని ఉలుండా బ్లాక్ ఆఫీస్ వద్ద నుంచి ఈ ఘటన జరిగింది. ఒడిషా బైట్స్ యూట్యూబ్ చానల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్ రబి నారాయణ్ సేనాపతికి చెందినదిగా గుర్తించారు. ఈయన ఒడిషాలోని ఉలుండా ప్రాంతవాసి అని తెలుస్తోంది.
తన ఇంటికి సమీపంలోని ఓ షాపుకి వెళ్ళిన రబి నారాయణ్ సేనాపతి అక్కడ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని పార్క్ చేసినట్లు సమాచారం. షాపు ముందు బండిని నిలిపి రబి నారాయణ్ వస్తువులు కొనేందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బ్యాటరీ పేలుడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరగలేదు.
ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు చెలరేగడంతో.. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే లోపే బండి పూర్తిగా దగ్ధమై పోయింది. టూవీలర్ ఏ కంపెనీకి చెందినదో కూడా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉంది.
వరుస ప్రమాదాలతో ప్రశ్నార్థకంగా మారిన Electric Vehicles భద్రత
వరుస పేలుడు ఘటనలతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇంకా ఈ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పెట్రోల్ రేట్లకు తాళలేక ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై గ్యారంటీ ఇవ్వలేమని తాజాగా వెలుగు చూస్తోన్న ఘటనలే ఉదాహరణ. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమాదాలు పరిపాటిగా మారాయి. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు జంకుతున్నారు.
గత నెల ఆరంభంలో ఇటువంటిదే ఈ-స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటనలో ఏడేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడు స్కూటర్ బాధితుడి ఇంట్లో చార్జింగ్ లో ఉంది. తెలంగాణలో జరిగిన మరొక ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్ లో మంటలు చెలరేగాయి. మంటలు పైన ఉన్న లాడ్జి కి వ్యాపించడంతో 8 మంది దుర్మరణం చెందారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.