Home News సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం: 8 మంది మృతి

సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం: 8 మంది మృతి

ముఖ్యాంశాలు:

సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో అగ్నిప్రమాదం: ఎలక్ట్రిక్ స్కూటర్ పేలుళ్ళు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువయ్యాయి. తరచూ ఎక్కడో ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటోంది. తాజాగా తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఒక షోరూమ్ లో ఈ-స్కూటర్ కి చార్జింగ్ పెడుతుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ-స్కూటర్ షోరూమ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ-స్కూటర్ షోరూమ్ లో చెలరేగిన మంటలు పైన అంతస్తుల్లో ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి. దీంతో ఊపిరాడక లాడ్జి గదుల్లో ఉన్న వారు కొందరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

నిప్పు ఎలా అంటుకుంది?

మీడియా కథనాలను బట్టి, సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో సోమవారం నాడు రాత్రి 10 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగి, రెండో ఫ్లోర్ కి వ్యాపించాయి. ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి మంటలు ఉదృతమవ్వడానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ పై నుంచి దూకిన జనాలు

అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఆ బిల్డింగ్ లో 24 మంది ఉన్నట్లు సమాచారం. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పలువురు తమ ఫ్లోర్స్ నుంచి క్రిందకు దూకినట్లు తెలుస్తోంది. మరికొంత మంది హోటల్ యొక్క డ్రైనేజీ పైపుల ద్వారా క్రిందకు దిగినట్లు సమాచారం. దీంతో చాలా మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు.

అదే సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. కానీ, అప్పటికే మొత్తం కమ్మేసిన పొగ వల్లన ఊపిరాడక 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ-స్కూటర్స్ కి చార్జింగ్ పెట్టినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయని, పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ఘటనపై స్పందించిన తెలంగాణ హోమ్ మినిస్టర్ మహ్మూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి విచారణ జరిపిస్తామని తెలిపారు. అయితే, ఇంకా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన రిపోర్ట్ బయటకు రావాల్సి ఉంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.