E-Commerce వెబ్‌సైట్స్ లో కనిపించే ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోన్న భారత ప్రభుత్వం

హైలైట్స్

  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూల సమస్య
  • ఫేక్ రివ్యూలతో నష్టపోతున్న వినియోగదారులు
  • ఫేక్ రివ్యూలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తోన్న భారత ప్రభుత్వం
Representative image.

ఇక మీదట ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూలకు అవకాశం ఉండదు. ఎన్నో ఉత్పత్తులపై ఈ -కామర్స్ సైట్స్ లో ఫేక్ రివ్యూలు తరచూ మనకు దర్శనమిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సదరు ప్రొడక్టుకి లేదా సంస్థకి లేదా వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే కొందరు కొనుగోలుదారులు ఇటువంటి ఫేక్ రివ్యూలు చదివి వాటికి బలవుతుంటారు. ఇకపై ఈ ఫేక్ రివ్యూల సమస్య లేకుండా భారత ప్రభుత్వం ఒక ఫ్రేం వర్క్ ని సిద్ధం చేసింది.

భారత ప్రభుత్వం ఇప్పటికే తన ఫ్రేం వర్క్ ని కన్జూమర్ రివ్యూలపై ఆధారపడి ప్రొడక్ట్స్ మరియు సేవలను వ్యాలిడేట్ చేసే సంస్థలకు పంపించింది. వీటిలో గూగుల్, మెటా, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, ట్రావెల్ వెబ్‌సైట్స్ మరియు ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి.

ఫేక్ రివ్యూలకు సంబంధించి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కి కొత్త మార్గనిర్ధేశకాలు

భారత ప్రభుత్వం ఫేక్ రివ్యూలపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తన కొత్త మార్గ నిర్దేశకాలను ఈ-కామర్స్ సంస్థలకు పంపించింది. దీని ద్వారా ఆన్‌లైన్ ఇంటరాక్షన్స్ మరియు ఈ-కామర్స్ ని మరింత పాదర్శకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో కస్టమర్లు తప్పుదోవ పట్టే అవకాశాలు తగ్గనున్నాయి.

రైటర్స్ కథనం ప్రకారం, ఈ-కామర్స్ సైట్స్ లో తప్పుడు మరియు మోసపూరిత రివ్యూలను గుర్తించేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి పరచాలని డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ జూన్ లో ఒక కమిటీని నియమించినట్లు సమాచారం.

ఫేక్ రివ్యూలకు అవకాశం కల్పిస్తున్నందుకు ఇటు వినియోగదారుల నుంచి అటు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి ఈ-కామర్స్ సైట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కస్టమర్లకు ఉత్పత్తిని ఎంచుకునే క్రమంలో ఫేక్ రివ్యూలు అడ్డంకిగా పరిణమిస్తున్నాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొత్త గైడ్‌లైన్స్ అనేవి కన్జూమర్లతో పాటు బ్రాండ్స్ కి మరింత పారదర్శకతతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తాయని LocalCircles ఫౌండర్ సచిన్ టపారియా తెలిపారు.

Meta మరియు Google సంస్థలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రిపోర్ట్ లో పేర్కొనబడింది. ఈ సంస్థలు 6-8 మెకానిజమ్స్ ద్వారా రివ్యూ ఇచ్చే అసలైన వ్యక్తి ఎవరనేది వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పనిగట్టుకుని తప్పుడు రివ్యూలు రాసే అకౌంట్స్ కి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అయితే ప్రభుత్వం రూపొందించిన పూర్తి డ్రాఫ్ట్ ప్రపోజల్ ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.