
ఎయిర్టెల్, జియో, వీఐ వంటి టెలీకామ్ సంస్థలు తమ ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలను పెంచడంతో, కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కు మారేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం, బీఎస్ఎన్ఎల్ కు తాజాగా 10 లక్షలమంది సబ్ స్క్రైబర్లు చేరినట్లు సమాచారం. మరి మీరు కూడా ఎయిర్టెల్, జియో, వీఐ నుంచి బీఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటే, మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్పీ) ని వినియోగించుకోవచ్చు. దీని ద్వారా మీరు బీఎస్ఎన్ఎల్ కు మీ ప్రస్తుత నంబర్ తోనే మారొచ్చు. మరి బీఎస్ఎన్ఎల్ పోర్టబులిటీ విధానం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం రండి.
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నుంచి BSNL కి మారడం ఎలా?
ఇందుకోసం మీరు మీకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ కు వెళ్ళి ఎంఎన్పీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆన్ లైన్ ద్వారా అవకాశం లేదు కాబట్టి ఇలా చేయక తప్పదు. ఎంఎన్పీ కొరకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- “Port<space>10-digit mobile number” అని టైప్ చేసి నుంచి 1900 కు ఎస్ఎంఎస్ పంపండి. అప్పుడు మీకు యూపీసీ (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. మీరు కనుక జమ్ము&కశ్మీర్ ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ అయితే, ఎస్ఎంఎస్ కు బదులుగా 1900 కి కాల్ చేయండి.
- ఇప్పుడు మీకు యూపీసీ మరియు ఎక్స్పైరీ డేట్ తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎంఎన్పీ కై రిక్వెస్ట్ చేసిన తేదీ నుంచి 15 రోజుల వరకు ఈ కోడ్ వాలిడిటీ ఉంటుంది. జమ్ము & కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు ఇది వర్తించదు. ఈ రాష్ట్రాలకు యూపీసీ కోడ్ వాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది.
- దీని తర్వాత మీరు దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రానికి లేదా రిటెయిలర్ వద్దకు లేదా అథారైజ్డ్ ఫ్రాంచైజీ దగ్గరకు వెళ్ళి మొబైల్ నంబర్ పోర్టబులిటీ కొరకు కస్టమర్ అప్లికేషన్ ఫార్మ్ నింపాలి. వాలిడ్ ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్ ను మీ వెంట తీసుకెళ్ళడం మరవొద్దు.
- మీ డిజిటల్ కేవైసీ పూర్తయ్యాక, బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు మీకు అందజేయబడుతుంది. అలాగే పోర్టింగ్ తేదీ, సమయం వంటివి ఎంఎన్పీ రిక్వెస్ట్ అప్రూవ్ అయ్యాక తెలుపబడతాయి.
- మీరు ప్రస్తుతం వాడుతోన్న నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యాక, మీకు సూచించిన సమయంలో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును ఫోన్ లో వేయండి. తర్వాత ఏదైనా సమస్యలు వస్తే కనుక, మీరు బీఎస్ఎన్ఎల్ టోల్-ఫ్రీ నంబర్ 1800-180-1503 కు కాల్ చేయవచ్చు.
బీఎస్ఎన్ఎల్ కు ఎందుకు మారాలి?
బీఎస్ఎన్ఎల్ 2023 లో పూర్తిస్థాయిలో 4జి సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు కసరత్తులు చేస్తోంది. అలాగే 2023 ఆగస్టు 15 కల్లా 5జి సేవలను కూడా అందించాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. ఇక మిగతా టెలీకామ్ సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ యొక్క ధరలు తక్కువ కావడం వల్లన వినియోగదారుడికి లాభం చేకూరనుంది.
తరచూ అడగబడే ప్రశ్నలు:
బీఎస్ఎన్ఎల్ పోర్టింగ్ చేసుకుంటే ఛార్జీలు ఉంటాయా?
ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్ ఎంఎన్ఫీ కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.
ప్రస్తుత నంబర్ బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది?
మీ యొక్క ఎంఎన్పీ రిక్వెస్ట్ అప్రూవ్ అయ్యాక, 3 నుంచి 5 రోజుల లోపు సిమ్ యాక్టివేట్ అవుతుంది. జమ్ము మరియు కశ్మీర్, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలకు 15 రోజుల వ్యవధి పడుతుంది.
బీఎస్ఎన్ఎల్ ఎంఎన్పీ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ ను ఎలా ట్రాక్ చేయాలి?
బీఎస్ఎన్ఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1503 కి కాల్ చేసి కస్టమర్ కేర్ ప్రతినిధి తో మాట్లాడి స్టేటస్ తెలుసుకోవచ్చు. లేదంటే, సమీపంలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం లేదా రిటైలర్ లేదా ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ ద్వారా ఎంఎన్పీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
మొబైల్ నంబర్ పోర్టింగ్ కొరకు ఏదైనా ఎలిజిబులిటీ నిబంధనలున్నాయా?
అవును కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. అవేంటో చూద్దాం.
- మీరు ప్రస్తుతం వాడుతోన్న నెట్వర్క్ వినియోగం 3 నెలలు పూర్తి కావాలి.
- ప్రస్తుతం వాడుతోన్న నెట్వర్క్ లో బకాయిలు ఏమీ ఉండరాదు.
- మొబైల్ నంబర్ యొక్క ఓనర్షిప్ మార్పునకు సంబంధించిన పెండింగ్ రిక్వెస్ట్ లు ఉండరాదు
- మొబైల్ నంబర్ కు ఎటువంటి న్యాయపరమైన వివాదాల్లో ప్రమేయం ఉండరాదు
- చందాదారుల ఒప్పందం ప్రకారం ఎటువంటి ఒప్పంద బాధ్యతల్లో మొబైల్ నంబర్ ముడిపడి ఉండరాదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.