హైలైట్స్
- 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం
- ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు
- భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్
భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఈ రెండు కంపెనీల 5జీ డివైజెస్ కి 5జీ సపోర్ట్ అప్డేట్స్ రాలేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. త్వరగా దేశంలో ఉన్న 5జీ కంపాటిబుల్ డివైజెస్ కి 5జీ అప్డేట్స్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్ లకు తెలిపింది.
5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 14 లో కూడా లేని 5జీ
ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 14 సిరీస్ వరకు ఆపిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపించాలని, ఎయిర్టెల్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఐఫోన్స్ కి 5జీ అప్డేట్స్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ చాలా సమయం తీసుకుంటోందని రైటర్స్ తో ఓ అధికారి అన్నారు. మరోవైపు శాంసంగ్ కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ కి ఇంకా 5జీ రోలౌట్ పంపలేదు. ఇదిలా ఉంటే, చైనా కంపెనీలైన షావోమీ, వివో లకు చెందిన 36 కి పైగా ఫోన్లకు 5జీ అప్డేట్స్ వచ్చాయి. ఆ ఫోన్లు ఎయిర్టెల్ 5జీ సేవలను వాడుకునేందుకు రెడీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో భారతీయ టెలీకామ్, ఐటీ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం నాడు సమావేశమై, 5జీ అడాప్షన్ ని త్వరగా పూర్తయ్యే విషయమై చర్చలు చేయనున్నారని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్, వివో, షావోమీ సంస్థల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.