Home News వచ్చే ఏడాది నుంచి ఒకేసారి భారత్, చైనాల్లో తయారు కానున్న Apple iPhone 15

వచ్చే ఏడాది నుంచి ఒకేసారి భారత్, చైనాల్లో తయారు కానున్న Apple iPhone 15

హైలైట్స్:

సెప్టెంబర్ 7 న జరగబోవు ఫార్ ఔట్ ఈవెంట్ లో ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. చైనాలో తయారైన ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు బయటకు వచ్చాక రెండు నెలలకు భారత్ లో ఈ సిరీస్ ఫోన్ల ఉత్పత్తి మొదలు కానుంది. అయితే ఐఫోన్ 15 ఉత్పత్తి మాత్రం చైనాతో సమానంగా ఏక కాలంలో మొదలవుతుందని, ప్రముఖ ఆపిల్ అనలిస్ట్ మింగ్-చో కువో తన ట్వీట్ లో పేర్కొన్నారు. భారత్, చైనా దేశాల మధ్య ఐఫోన్స్ ఉత్పత్తి ధర వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15 ఉత్పత్తి వచ్చే ఏడాది నుంచి ఇరు దేశాల్లో ఏక కాలంలో మొదలవ్వడం మనం చూడబోతున్నాం.

“ఐఫోన్ 14 సిరీస్ మాస్ ప్రొడక్షన్ షెడ్యూల్ భారత్ లో చైనాతో పోల్చితే 6 వారాలు వెనకాలే ఉంది. అయితే ఇది చాలా వరకు మెరుగైందని చెప్పాలి,” అని మరో ట్వీట్ లో మింగ్ చో కువో అన్నారు. అంటే ఐఫోన్ 14 లైనప్ ఆరు వారాలు ఆలస్యంగా మొదలవుతుంది. కానీ, రెండు నెలలు కాదు. వచ్చే ఏడాది నుంచి ఒకేసారి భారత్, చైనాల్లో ఐఫోన్ 15 తయారీ మొదలవుతుందని మింగ్ చో చెప్పారు.

2017 లో ఆపిల్ సంస్థ భారత్ లో ఐఫోన్ ఎస్ఈ ఫోన్ తయారీని తొలుత మొదలు పెట్టింది. ఇక అప్పటి నుంచి ఆపిల్ కంపెనీ, భారత్ లో తన ఉత్పత్తిని మెల్లగా పెంచుతూ పోతోంది. అయితే ఈ ఏడాది ఐఫోన్ 14 సిరీస్ ఉత్పత్తిలో భారత్-చైనా దేశాల మధ్య పోటీని మనం చూడకపోవచ్చు. అయితే ఐఫోన్ 15 ప్రొడక్షన్ పై రెండు దేశాలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. చైనాకు ఆవల ఐఫోన్ సిరీస్ ఉత్పత్తి ఏక కాలంలో జరగనుండటం తొలిసారిగా చూస్తున్నాం.

ఇక ఈ ఏడాది విడుదల కాబోవు ఐఫోన్ 14 సిరీస్ గురించి విశేషాలను తెలుసుకుందాం. ఐఫోన్ కొత్త సిరీస్ లో ఈసారి మినీ వేరియంట్ ఉండటం లేదు. తాజాగా బయటకు వచ్చిన రెండర్స్ (ఇమేజెస్) ని చూస్తే, నాచ్ డిస్ప్లే కూడా ఉండబోదని స్పష్టమవుతోంది. అలాగే తాజాగా లీకైన ఓ రిపోర్ట్ ని బట్టి తెలుస్తున్నదేంటంటే, ఐఫోన్ 14 సిరీస్ లో ప్లస్ వేరియంట్ కూడా వస్తోంది. ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్లస్ వేరియంట్ జనాలను పలకరించబోతోంది. అలాగే, ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ సపోర్ట్, మెరుగైన అల్ట్రావైడ్ లో-లైట్ కెమెరా తో రానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.