Home News Jio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi

Jio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi

హైలైట్స్:

Jio 5G Launch: రిలయన్స్ జియో వచ్చే నెలలో 5జీ సేవలను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 24 న దీపావళి రోజున Jio 5G నెట్వర్క్ లాంచ్ కానుంది. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ విషయాన్ని ముకేశ్ అంబాని స్వయంగా వెల్లడించారు. తాజాగా టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెలువరించిన నివేదిక జియోకి శుభవార్తను మోసుకొచ్చింది. జియో సిమ్ కొనేందుకు కస్టమర్లు పోటీ పడుతున్నారని తన నివేదికలో ట్రాయ్ పేర్కొంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

పెరిగిన Jio యూజర్ల సంఖ్య

టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజా నివేదిక ప్రకారం, జులై లో జియో సంస్థ 29 లక్షల 40 వేల మంది కొత్త కస్టమర్లను పొందింది. అదే జూన్ నెలలో 4 లక్షల 20 వేల మంది కొత్త కస్టమర్లను జియో సంపాదించింది. ఈ లెక్కలను బట్టి, జియో సిమ్ కొనేందుకు జనాలు ఎంతగా పోటీ పడుతున్నారో అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇది వరకు ఒక సిమ్ ఉన్నవారు రెండవ సిమ్ గా జియో ని ఎంచుకుంటున్నారు. మరికొందరు జియో కి పోర్ట్ అయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదంతా జియో 5జీ మహిమ అని చెప్పవచ్చు.

వెనకబడ్డ Airtel, Vi

మరోవైపు, మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ జులై లో కేవలం 5 లక్షల కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఈ గణాంకాలు ఎయిర్టెల్ కి గట్టి సవాల్ ని విసురుతున్నాయని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఎయిర్టెల్ సంస్థ ఎటువంటి ప్రణాళికలతో కస్టమర్ల ముందుకు వస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోన్న వొడాఫోన్ ఐడియా, జులై మాసంలో 15 లక్షల కస్టమర్లను కోల్పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 13,27,999 కస్టమర్లను కోల్పోయింది. చివరగా, ఎంటీఎన్ఎల్ సంస్థ 3,038 మంది యూజర్లను కోల్పోయింది.

415 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న Jio

ట్రాయ్ డేటా ప్రకారం, ప్రస్తుతం జియో అత్యదిక టెలీకామ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. జియోకి ప్రస్తుతం 41.59 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక భారతి ఎయిర్టెల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ సంస్థ 363 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. 255 మిలియన్ కస్టమర్లతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Jio 5G బ్యాండ్స్

5జీ స్పెక్ట్రమ్ వేలంలో జియో ఆదిపత్యం కొనసాగిన విషయం తెలిసిందే. 700 MHz లో ప్రీక్వెన్సీ బ్యాండ్ తో పాటు 800 MHz, 1800 MHz, 3300 MHz వంటి మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, 26 GHz హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ని జియో సొంతం చేసుకుంది. దేశంలోని 22 టెలీకామ్ సర్కిల్స్ లో జియో 700 MHz ప్రీమియమ్ స్పెక్ట్రమ్ ని కైవసం చేసుకుని పై చేయి సాధించింది. తొలి దశలో ప్రధాన నగరాల్లో మాత్రమే 5జీ సేవలు మొదలు కానున్నాయి.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.