హైలైట్స్:
- ఎంపిక చేయబడిన మెట్రో నగరాల్లో ఈ దీపావళికి 5జీ సేవలను లాంచ్ చేయనున్న ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో
- గూగుల్ తో కలిసి 5జీ ఫోన్ పై పని చేస్తున్నట్లు వెల్లడించిన జియో
- భారత్ లో జియో ఫోన్ 5జీ ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం
జియో ఫోన్ 5జీ లాంచ్: రిలయన్స్ జియో ఎట్టకేలకు జియో 5జీ సేవలను నేడు యాన్యువల్ జనరల్ మీటింగ్ 2022 ఈవెంట్ లో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబాని సమావేశంలో మాట్లాడుతూ, జియో 5జీ సేవలు దీపావళి కల్లా ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, గూగుల్ తో కలిసి 5జీ ఫోన్ కోసం పని చేస్తున్నట్లు ముకేశ్ అంబాని తెలిపారు. ఈ ఫోన్ ని జియో ఫోన్ 5జీ అని పిలిచే అవకాశముంది. అయితే అధికారిక పేరు ఇంకా తెలియదు.
త్వరలోనే 5జీ ఫోన్ ని లాంచ్ చేస్తామని, అందు కొరకు గూగుల్ తో కలిసి పని చేస్తున్నట్లు యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అంబాని తెలిపారు. వచ్చే ఏడాది ఏజీఎం ఈవెంట్ కల్లా జియో ఫోన్ 5జీ సిద్దం కానుందని అంబాని హింట్ ఇచ్చారు. జియో మరియు గూగుల్ కలిసి ఇదివరకు జియో ఫోన్ నెక్ట్స్ ని అభివృద్ది చేయగా, ఇప్పుడు రెండో ఫోన్ కోసం కలిసి పని చేస్తున్నాయి.
తాము గూగుల్ తో కలిసి తేనున్న 5జీ ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలను జియో వెల్లడించలేదు. కానీ, రూమర్లను బట్టి పలు వివరాలు బయటకు వచ్చాయి. ఏజీఎం ఈవెంట్ కి ముందు, పలు నివేదికల ద్వారా ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Jio Phone 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
జియో ఫోన్ 5జీ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉండనుంది. ఇది హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 480 5జీ ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించనున్నారు. 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉండనుంది.
జియో ఫోన్ 5జీ ప్రగతి ఓఎస్ పై పని చేయనుంది. ఇందులో జియో యాప్స్, గూగుల్ ప్లే సర్వీసెస్ ఉండనున్నాయి. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, రీడ్-లౌడ్ టెక్స్ట్, గూగుల్ లెన్స్ ద్వారా ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్, గూగుల్ ట్రాన్స్‌లేట్, తదితర ఫీచర్లు జియో ఫోన్ 5జీ లో ఉంటాయి.
జియో ఫోన్ 5జీ 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. జియో ఫోన్ 5జీ లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండనుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. భద్రత కొరకు ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందిస్తున్నారు.
భారత్ లో Jio Phone 5G ధర (అంచనా)
ధర విషయానికి వస్తే, దేశంలోనే తక్కువ రేటు కలిగిన 5జీ ఫోన్ గా జియో ఫోన్ 5జీ నిలవనుంది. ఏజీఎం సందర్భంగా మాట్లాడిన అంబాని, జియో 5జీ ఫోన్ ని చాలా తక్కువ ధరకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక గతేడాది జియోఫోన్ నెక్ట్స్ రూ.6,499 ధరతో విడుదలైంది.