హైలైట్స్:
- ఐఫోన్లపై నిషేధం విధించిన బ్రెజిల్ న్యాయ మంత్రిత్వశాఖ
- బాక్స్ లో చార్జర్ అందించకపోవడమే బ్యాన్ కి ప్రధాన కారణం
- ఆపిల్ కు 2.3 మిలియన్ డాలర్ల జరిమానా వేసిన బ్రెజిల్ ప్రభుత్వం
ఆపిల్ నిర్వహించే ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ నేడు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. లాంచ్ పై ఇప్పటికే ఎంతో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రో వర్షన్ ఐఫోన్స్ డిజైన్ మేకోవర్ తో వస్తున్నాయి. ఈ కోలాహలం నడుమ ఆపిల్ కి షాక్ తగిలింది. బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ తమ దేశంలో ఐఫోన్స్ పై బ్యాన్ ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోన్ తో చార్జర్ ని ప్రొవైడ్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బ్రెజిల్ ప్రభుత్వం ఆపిల్ పై 2.3 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆమేరకు బ్రెజిలియన్ ఫెడరల్ రిజిస్టర్ లో పేర్కొనబడింది.
2021 అక్టోబర్ లో, బ్రెజిల్ న్యాయశాఖ ఆపిల్, శాంసంగ్ లను ఉద్దేశించి, చార్జర్ తీసేయడానికి గల కారణాలేంటో తెలపాలని ఆదేశించింది. 2022 మే నెలలో ఆపిల్, శాంసంగ్ లపై అడ్మిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ని మొదలు పెట్టాలని బ్రెజిల్ కన్జూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేటర్ ని ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆపిల్, ప్రభుత్వ నిర్ణయంపై అప్పీల్ కి వెళతామని తెలిపింది.
iPhone అమ్మకాలపై నిషేధం, స్పందించిన ఆపిల్
ఆపిల్ సంస్థ ఐఫోన్ తో పాటు బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ ని అందించడం లేదని, అందుచేత ఐఫోన్స్ అమ్మకాలపై బ్రెజిల్ న్యాయశాఖ నిషేధం విధించింది. బ్రెజిలియన్ పత్రిక జీ1 లో ఆమేరకు కథనం ప్రచురితమైంది. “ఐఫోన్ 12 మోడల్ తదనంతరం చార్జింగ్ అడాప్టర్ లేకుండా వచ్చిన అన్ని ఐఫోన్లపై బ్యాన్ ని విధించడం జరిగింది. బీఆర్ఎల్ 12,274,500 జరిమానా వేయడం జరిగింది. చార్జర్ లేకుండా ఏ ఐఫోన్ కూడా అమ్మడానికి వీలు లేదు,” అని బ్రెజిల్ న్యాయశాఖ పేర్కొంది.
భూమి యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించేందుకే తాము బాక్స్ నుంచి చార్జర్ ని తొలగించామని ఆపిల్ వాదిస్తోంది. అలాగే తమ వాదనను బలంగా నమ్ముతోంది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అప్పీల్ చేయనున్నట్లు ఆపిల్ సంస్థ వెల్లడించింది.
“ఆపిల్ చేసే ప్రతి పని భూమిపై, జనాలపై ఎలా ప్రభావం చూపుతుందోనన్న విషయాన్ని కంపెనీ దృష్టిలో పెట్టుకుంటుంది. పవర్ అడాప్టర్లు భారీ మొత్తంలో జింక్, ప్లాస్టిక్ వినియోగానికి కారణమవుతాయి. బాక్స్ నుంచి వాటిని తొలగించడం వల్లన, 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఇది ప్రతి ఏడాది రోడ్లపై నుంచి 5 లక్షల కార్లను తొలగించడంతో సమానం. ఇప్పటికే ప్రపంచంలో బిలియన్ల కొలది యూఎస్బీ-ఏ చార్జర్లు వాడుకలో ఉన్నాయి. మేం ఇప్పటికే బ్రెజిల్ లో ఎన్నో కోర్టు కేసులు గెలిచాం. కస్టమర్లు తమ ఐఫోన్ల చార్జింగ్ కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తారని విశ్వసిస్తున్నాం. మేం ప్రభుత్వం తో మాట్లాడి వారి వాదనలను వింటాం. అలాగే నిర్ణయంపై అప్పీల్ కు వెళ్ళేందుకై ప్లాన్ చేస్తాం,” అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు, శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ల బాక్సుల్లో చార్జర్ లను జత చేసి బ్రెజిల్ లో అమ్మడం ప్రారంభించింది. అయితే, ఆపిల్ ఐఫోన్ బాక్సుల్లో చార్జర్ లు లేవు. ఇకపోతే ఆపిల్ సంస్థ 2030 కల్లా కార్బర్ న్యూట్రల్ గా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందుకోసమే బాక్సుల నుంచి చార్జర్ లను తొలగించడం మొదలు పెట్టింది. అయితే, ఆపిల్ పై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చార్జర్ తొలగింపు పై వివరణ కోరడమో లేదా కోర్టుకు లాగడమో చేశాయి.