హైలైట్స్:
- ఓటీటీ లో ప్రసారం కానున్న రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం
- చిత్ర హక్కులను కొనుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్, సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాది భాషల్లో ప్రసారం
- చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మాస్ మహారాజా రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి

రామారావు ఆన్ డ్యూటీ: మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం 2022 జులై 29 న థియేటర్లలో విడుదలైంది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి రీ-ఎంట్రీ ఇచ్చారు. కాగా, ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సైట్ సోని లివ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15 నుంచి అన్ని దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది.
చిత్రకథ
1995 నేపథ్యంలో సినిమా సాగుతుంది. రామారావు (రవితేజ) ఒక రెవెన్యూ అధికారి. ఆయనకు అవినీతి అంటే అస్సలు గిట్టదు. తన మాజీ ప్రేయసి మాలిని (రజీశ విజయన్) ఓసారి రామారావు ని కలిసి తన భర్త మిస్ అయ్యాడని, సాయం చేయమని కోరుతుంది. దర్యాప్తు మొదలుపెట్టిన రామారావు, తన గ్రామంలో చాలా మంది ఎర్రచందనం అక్రమ రవాణాలో కనబడకుండా పోయారని తెలుసుకుంటాడు. మరి ఇది జరగడానికి కారణం ఎవరు? రామారావు ఎలా ఈ కేస్ ని చేదిస్తాడన్నది మిగతా కథ.
చిత్ర విశేషాలు
రవితేజ నటన చిత్రానికి ప్రధాన బలం. రెవెన్యూ అధికారి పాత్రలో మాస్ మహారాజా బాగా చేశాడు. ద్వితీయార్థంలో రవితేజ నటన చాలా బాగుంది. ఇన్విస్టిగేషన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. నాజర్ తన పాత్రలో ఒదిగిపోయారు. తనికెళ్ళ భరణి తన పాత్రకి న్యాయం చేశారు. ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. తన పాత్ర నెగటివ్ అయినప్పటికీ, ఎందిరా స్వామి అనే డైలాగ్ తో అందరి హృదయాలను గెలుచుకుంటాడు. అయితే వేణు తొట్టెంపూడి పాత్రను ఇంకా బాగా రాసుకోవాల్సి ఉంది.
నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం 1990 ల కాలాన్ని చూపించే ప్రయత్నం చేసింది. డైలాగ్స్ పర్వాలేదు. సామ్ సీఎస్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక దర్శకుడు శరత్ మండవ విషయానికి వస్తే, తన తొలి సినిమాతో ఆయన పెద్దగా ప్రభావం చూపలేదు. సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా చేశాడు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా చేశాడు.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోని లివ్ దక్కించుకుంది. కాగా, సెప్టెంబర్ 15 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రామారావు ఆన్ డ్యూటీ ప్రసారం కానుందని సోని లివ్ ప్రకటించింది.
లేటెస్ట్ ఓటీటీ, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్స్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.











