
మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిత్రం అనౌన్స్‌మెంట్ ఉంటుందా, ఇంకెప్పుడు థియేటర్లలో ఆ చిత్రాన్ని చూద్దామా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు నిరాశలో కూరుకుపోయారు. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలను చేస్తూ పోతున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది.
బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కేవలం హిట్ మాత్రమే కాదండోయ్, చిరు కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రాల జాబితాలో ఒకటిగా వాల్తేరు వీరయ్య నిలిచింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
Netflix లో ప్రసారం కానున్న వాల్తేరు వీరయ్య
చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని సదరు సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి 27 వస్తుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో మెగా మాస్ యాక్షన్ ని చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నారు.
చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం
వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, సత్యరాజ్, కేథరిన్, జాన్ విజయ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, సప్తగిరి, షకలక శంకర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో కనిపించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫర్ గా చేశారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
చిత్ర కథ
2023 జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం థియేటర్లలో విడుదలైంది. వైజాగ్ లో స్మగ్లింగ్ చేసే వీరయ్య (చిరంజీవి)ని, ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) ఎలా అడ్డుకున్నాడు? తదనంతర పరిణామాలే చిత్ర కథ. వీరయ్య పాత్రలో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు. మాస్ అవతారంలో చిరు రఫ్ గా కనిపంచారు. మరోవైపు పోలీసు అధికారి పాత్రలో రవితేజ తన మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇటు చిరు, అటు రవితేజ ఇరగదీశారు. కథానాయిక పాత్రలో శృతిహాసన్ బాగా చేశారు. చిరు, శృతి ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంది.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చింది. వీరయ్య టైటిల్ సాంగ్, నీకేమో అందమెక్కువ, బాస్ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ ఇలా అన్నీ పాటలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. బాబీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చాటారు. ఆయన రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు, చిత్రీకరణ బాగున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











