హైలైట్స్:
- జూన్ త్రైమాసికంలో 6.1 మిలియన్ ఫోన్లని అమ్మిన రియల్ మీ, 23శాతం YoY (Year-Over-Year) వృద్ధి రేటు నమోదు
- 2.7 శాతం వైఓవై గ్రోత్ ని నమోదు చేసినప్పటికీ 4 వ స్థానానికే పరిమితమైన శాంసంగ్
- మూడో త్రైమాసికంలో కూడా ప్రభావం చూపిన భారత్ లో నెలకొన్న స్మార్ట్ ఫోన్ గిరాకీ లేమి
భారతదేశపు రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా రియల్ మీ అవతరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, రియల్ మీ దూసుకెళ్తుండటం విశేషం. జూన్ త్రైమాసికం లో కూడా భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆశావాహంగా కనిపించలేదు. మార్కెట్ పై తీవ్ర ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ వెలువరించిన తాజా నివేదికను బట్టి ఇది స్పష్టమవుతోంది. 2.9 ఇయర్ ఓవర్ ఇయర్ వృద్ధిని రేటుని నమోదు చేసినప్పటికీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి 5 శాతం దిగజారింది.
భారత్ లో Smartphone తయారీదారుల వృద్ధి రేటు
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారులు రియల్ మీ, వివో మార్కెట్ క్షీణతతో సంబంధం లేకుండా వృద్ధిని సాధించాయి. 2022 రెండో త్రైమాసికంలో 6.1 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ అమ్మిన రియల్ మీ సంస్థ 23.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు 5.9 మిలియన్ డివైజెస్ అమ్మి వివో 17.4 శాతం ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ ని సాధించింది. దీంతో రియల్ మీ భారత్ లో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయదారుగా నిలిచింది. యథావిధిగా మరో చైనా కంపెనీ షావోమీ భారత్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మొదటి స్థానానికి, రెండో స్థానానికి అంతరం చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.
ఐడీసీ ప్రకారం, 2022 రెండో త్రైమాసికంలో షావోమీ అమ్మకాలు 28.2 శాతానికి తగ్గి, 7.1 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. రెండేళ్ళ క్రితం, అంటే 2020 రెండో త్రైమాసికంలో షావోమీ, రియల్ మీ కంటే మూడింతలు ఎక్కువగా ఫోన్లను విక్రయించింది. ఇక అప్పట్లో షావోమీ, రియల్ మీ కంపెనీలకు మధ్య అంతరం 20 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 3 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ గణాంకాలు భారత్ లో రియల్ మీ యొక్క బలమైన వృద్ధిని తెలియజేస్తున్నాయి.
ఆశ్చర్యకరంగా కొరియన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో నాల్గవ స్థానానికి పడిపోయింది. 2.7 శాతం మేర ఫోన్ల అమ్మకాలు పెరిగినప్పటికీ, రియల్ మీ, వివో వృద్ధి ముందు శాంసంగ్ తాళలేకపోయింది. ఐడీసీ నివేదిక ప్రకారం, శాంసంగ్ యొక్క హయ్యస్ట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.20,000 గా ఉంది. ఇక భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రస్తుత త్రైమాసికం యొక్క యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.16,800 గా ఉంది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్లో శాంసంగ్ మరిన్ని నాణ్యమైన, ఫీచర్ రిచ్ ఫోన్లను లాంచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది.
మరో దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఒప్పో ర్యాంకింగ్స్ లో 5 వ స్థానానికి పరిమితమైంది. 2.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఒప్పో కంపెనీ, జూన్ త్రైమాసికంలో 4 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ ని అమ్మింది.













