హైలైట్స్:
- ఇటీవలె విడుదలైన గార్గి సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు
- ప్రధాన పాత్ర పోషించిన సాయి పల్లవికి సర్వత్రా ప్రశంసల వెల్లువ
- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గార్గి రిలీజ్
- ఆగస్టు నెలలో ఓ దిగ్గజ ఓటీటీకి రానున్న సినిమా
ఇటీవలె సాయి పల్లవి నటించిన గార్గి చిత్రం థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సాయి పల్లవి గత చిత్రం విరాట పర్వం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కానీ, గార్గి చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హరి హరన్ రాజు తో కలిసి కథను సమకూర్చిన గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు.
ఉత్కంఠభరితంగా సాగే లీగల్ డ్రామా అయినప్పటికీ, సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని అందించింది గార్గి. అలాగే ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్సెస్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. జులై విడుదలైన ఈ చిత్రం ఆగస్టు రెండో వారంలో ఓటీటీ లో ప్రీమియర్ అవ్వనుందని బలంగా టాక్ వినిపిస్తోంది. ఒక జాతీయస్థాయి ఓటీటీ సంస్థ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.
ఇక చిత్రంలో సాయి పల్లవి నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇదే అత్యుత్తమమైనదని అందరూ అంటున్నారు. సాయి పల్లవి పాత్ర విభిన్న వయసు వారికి కనెక్ట్ కావడం ఇందుకు ప్రధాన కారణం. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రయంతి, ప్రేమ్ కృష్ణ అక్కటు అనే ఇద్దరు సినిమాటోగ్రఫర్లు ఈ చిత్రం కోసం పని చేశారు. ఇక ఎడిటింగ్ బాధ్యతలను మహ్మద్ అలీ నిర్వర్తించారు.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాశ్, కళైమామణి శరవణన్, ఆర్ఎస్ శివాజీ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతాప్, రాజలక్ష్మి, లివింగ్ స్టన్, రెజిన్ రోజ్, బిగిల్ శివ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
చిత్ర కథ:
గార్గి (సాయిపల్లవి) స్కూలు టీచర్ గా పని చేస్తుంది. తండ్రి ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజున తండ్రి విధులు ముగించుకుని రావడం ఆలస్యమవుతుంది. ఎంతసేపటికీ రాక పోవడంతో, ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళిన గార్గికి తన తండ్రి ఓ తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన చేసులో అరెస్ట్ అయ్యాడని తెలుసుకుంటుంది. కానీ, తండ్రి తప్పు చేయలేదని గార్గి బలంగా నమ్ముతుంది. దీంతో తండ్రిని విడిపించేందుకు న్యాయపోరాటం చేస్తుంది గార్గి. ఈ పోరాటంలో గార్గికి ఎదురైన సవాళ్ళు, గార్గి కుటుంబాన్ని సమాజం ఎలా చూసింది? తండ్రి నిర్దోషి అని గార్గి నిరూపించిందా? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కోర్ట్ రూం డ్రామాలు, ఉత్కంఠభరితంగా సాగే కథలను ఇష్టపడే వారు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు అనే సున్నిత అంశంపై తీసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడదగిన విధంగా, అశ్లీలతకు తావు లేకుండా దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తీర్చిదిద్దారు. కాబట్టి, సమాజహితమైన, సందేశాత్మక చిత్రమైన గార్గి ని అందరూ చూసి ఒక చక్కటి సినిమాను చూశామన్న అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నాం. త్వరలోనే ఓటీటీ ప్రీమియర్ తేదీ, ఇతర వివరాలను అందిస్తాం.












