హైలైట్స్:
- ఆస్కార్ నామినేషన్స్ బరిలో శ్యామ్ సింగ రాయ్
- పీరియాడిక్ ఫిల్మ్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్ కేటగిరీల్లో పోటీకి దిగిన శ్యామ్ సింగ రాయ్
- చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతీ శెట్టి

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది. మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి దిగింది. అవి: పీరియాడిక్ ఫిల్మ్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్. నామినేషన్ జాబితాలో స్థానం పొందితేనే పురస్కారం పొందేందుకు అవకాశం ఉంటుంది.
శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నిహారికా ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున ప్రశంసలు దక్కాయి.
శ్యామ్ సింగ రాయ్ చిత్ర కథ:
దర్శకుడు కావాలని తపించే ఫిల్మ్ మేకర్ వాసు (నాని), ఒక పర్ఫెక్ట్ సినిమా తీయాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అతనికి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. గత జన్మలో అతడు శ్యామ్ సింగ రాయ్ అనే పేరుమోసిన రచయిత. 1970 లో కోల్ కతా నగరంలో జీవిస్తుంటాడు. రోజీ (సాయిపల్లవి) అనే అమ్మాయితో శ్యామ్ సింగ రాయ్ ప్రేమలో ఉంటాడు. మరి తన గత జన్మను గురించి తెలుసుకున్న శ్యామ్ సింగ రాయ్ అలియాస్ వాసు ప్రస్తుత జన్మలో కోల్ కతా వెళ్ళి తన ప్రేయసిని కలుస్తాడా? ఆమె బతికే ఉంటుందా? అసలేం జరుగుతుంది? అనేది చిత్ర కథ. మీరు కనుక, ఈ చిత్రం ఇంకా చూడనట్లైతే, ప్రముఖ ఓటీటీ సైట్ నెట్‌ఫ్లిక్స్ లో చూడండి.
2023 మార్చి 12 వ తేదీన హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో 95 వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ 31 కల్లా ఎలిజిబిలిటీ వ్యవధి ముగుస్తుంది. జనవరి 12 నుంచి జనవరి 17, 2023 మధ్య నామినీస్ కి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 2023 జనవరి 24 న నామినీలను ప్రకటిస్తారు. ఇక ఫైనల్ ఓటింగ్ ప్రక్రియ 2023 మార్చి 2 నుంచి మార్చి 7 మధ్య జరుగుతుంది. జనరల్ ఎంట్రీ కేటగిరీస్ సబ్‌మిషన్ కి డెడ్ లైన్ 2023, నవంబర్ 15 తో ముగుస్తుంది.
ఇప్పటి వరకు, ఆస్కార్ కి నామినేట్ అయిన చిత్రాలేంటో తెలుసుకుందాం. మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. గత కొన్నేళ్ళుగా భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీస్ హిస్టరీ చూస్తే, కూలంగల్, జల్లికట్టు, గల్లీ బాయ్, విలేజ్ రాక్‌స్టార్స్, న్యూటన్, విసారనై చిత్రాలు మనకు కనిపిస్తాయి. కానీ, ఇవేవీ ఆస్కార్ కి షార్ట్‌లిస్ట్ కాలేదు. మరి, శ్యామ్ సింగ రాయ్ అయినా నామినేట్ అయి పురస్కారం దక్కించుకుంటుందేమో చూడాలి.











