హైలైట్స్:
- ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సనంద్ ఫెసిలిటీని కొనుగోలు చేసిన టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్)
- రూ.725.7 కోట్లకు సనంద్ ప్లాంట్ ని కైవసం చేసుకున్న టాటా కంపెనీ
- ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను తయారు చేసేందుకు ఈ ప్లాంట్ ని వినియోగించనున్న టీపీఈఎంఎల్
గుజరాత్ లోని ఫోర్డ్ ఇండియా యొక్క సనంద్ ప్రొడక్షన్ ఫెసిలిటీని టాటా మోటార్స్ కైవసం చేసుకుంది. రూ.725 కోట్ల విలువైన యూనిట్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ పై టాటా మోటార్స్ సంతకం చేసింది. టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ విభాగం అయిన టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, అమెరికన్ మానుఫాక్చరర్ ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సనంద్ ప్రొడక్షన్ ఫెసిలిటీని కొనుగోలు చేసింది. ఫోర్డ్ ఇండియా భారత్ లో కార్ల విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భద్రతా ప్రమాణాలకు టాటా మోటార్స్ మొదటి ప్రాధాన్యతనివ్వడమే ఇందుకు కారణం. దీంతో జనాలు టాటా వాహనాలపై మక్కువ పెంచుకున్నారు. అందుకే టాటా వాహనాలకు గిరాకీ పెరిగింది. ఈ తరుణంలో, డిమాండ్ కి తగినట్లు సప్లైని పెంచేందుకు ఉత్పత్తి పెంపుదల లక్ష్యంలో భాగంగా టాటా మోటార్స్ ఫోర్డ్ ఇండియా యొక్క సనంద్ ఫెసిలిటీని కొనాలని భావించింది. ఆమేరకు తాజాగా డీల్ ని క్లోజ్ చేసింది. టీపీఈఎంఎల్ తన ఉత్పత్తి అవసరాలకు తగిన విధంగా ప్లాంట్ లో మార్పు చేర్పులు చేయనుంది.
Ford యొక్క సనంద్ ప్లాంట్ ని కొన్న Tata Motors
ఫోర్డ్ సనంద్ ప్రొడక్షన్ ఫెసిలిటీకి సంబంధించిన భూమి, భవంతులు, వాహనాలు తయారయ్యే ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఇతర పరికరాలు అన్నింటిని టాటా మోటార్స్ కొనేసింది. అర్హత కలిగిన ఫోర్డ్ సనంద్ ప్లాంట్ ఉద్యోగులను కొనసాగించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.
అయితే ఫోర్డ్ ఇండియా తన పవర్‌ట్రెయిన్ తయారీ కేంద్రాన్ని కొనసాగించనుంది. అలాగే టీపీఈఎంఎల్ తో లీజ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, టీపీఈఎంఎల్ సంబంధిత ప్లాంట్ ను వినియోగించుకునే వీలుంది. పవర్‌ట్రెయిన్ తయారీ కేంద్రం కార్యాకలాపాలను నిలిపివేయాలని ఫోర్డ్ భావిస్తే గనుక, ప్లాంట్ లోని ఉద్యోగులను తీసుకునేందుకు టీపీఈఎంఎల్ ఒప్పుకుంది.
అన్ని అవసరమైన క్లియరెన్సెస్, అప్రూవల్స్ వచ్చాక ఈ డీల్ పూర్తి అవ్వనుంది. ఈ హక్కుదారు మార్పుకి సంబంధించిన లావాదేవీ సజావుగా ముందుకెళ్ళేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, టీపీఈఎంఎల్, ఎఫ్ఐపీఎల్ ల మధ్య ఒక ఎంఓయూ 2022, మే 30 న ఎగ్జిక్యూట్ అయ్యింది.
గుజరాత్ రాష్ట్రం లోని ఫోర్డ్ ఇండియా సనంద్ ఫెసిలిటీని సొంతం చేసుకోవడం ద్వారా ఏడాదికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ను టాటా మోటార్స్ సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది. అలాగే 4,20,000 యూనిట్స్ వరకు ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇటీవలె టాటా మోటార్స్, ఎఫ్ఐపీఎల్ కి సమీపంలోనే ఓ ప్లాంట్ నుంచి తన కార్యాకలాపాలను మొదలు పెట్టింది. దీంతో ట్రాన్సిషన్ మరింత సులభతరం కానుంది.
లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.