హైలైట్స్:
- టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన టాప్ గన్: మావెరిక్
- 1986 లో విడుదలైన టాప్ గన్ చిత్రానికి ఇది సీక్వెల్, అందులోనూ ప్రధాన పాత్ర పోషించిన టామ్ క్రూజ్
- ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోన్న టాప్ గన్: మావెరిక్ తెలుగు వర్షన్
టామ్ క్రూజ్ ప్రధాన పాత్ర పోషించిన టాప్ గన్: మావెరిక్ చిత్రం, 1986 లో వచ్చిన టాప్ గన్ చిత్రానికి సీక్వెల్. టాప్ గన్ లో కూడా టామ్ క్రూజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల గ్రాస్ ని సాధించింది. టామ్ క్రూజ్ సినీ కెరీర్ లోనే ఈ చిత్రం హయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. వెండితెరపై అభిమానులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో విడుదలైంది.
ఆగస్టు 24, అంటే నేటి నుంచి ఈ చిత్రం ఓటీటీలో ప్రసారమవుతోంది. బుక్ మై షో పై ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. బుక్ మై షో నుంచి ఈ చిత్రాన్ని యూజర్లు కొనుక్కొని లేదా అద్దెకు తీసుకుని చూడవచ్చు. అలాగే ఓటీటీ దిగ్గజం ప్రైమ్ వీడియో లో కూడా టాప్ గన్: మావెరిక్ నేటి నుంచి ప్రసారమవుతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
యూఎస్ నేవీ కెప్టెన్ పీట్ మిచెల్ (టామ్ క్రూజ్) యొక్క జీవితం ఆధారంగా ఈ యాక్షన్ డ్రామా సాగుతుంది. ఇందులో టామ్ క్రూజ్ టెస్ట్ పైలట్ మరియు ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ గా చేశాడు. టామ్ క్రూజ్ తన కెరీర్లో ఎన్నో మైలురాళ్ళను అదిరోహించడంతో పాటు, మరెన్నో ప్రశంసలను పొందాడు. ఇప్పుడు అతడికి ఒక ఇల్లీగల్ యురేనియమ్ ఎన్‌రిచ్మెంట్ ప్లాంట్ ని విధ్వంసం చేసే బాధ్యతను అప్పగించడమైనది.
Top Gun: Maverick తారాగణం
టాప్ గన్: మావెరిక్ చిత్రంలో వాల్ కిల్మర్, మైల్స్ టెల్లర్, జెన్నిఫర్ కనెల్లీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని జోసెఫ్ కొసిన్స్కీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా, టామ్ క్రూజ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. జెర్రీ బ్రుకైమర్ కూడా మరో నిర్మాతగా వ్యవహరించాడు.
2022, మే 27 న యూఎస్ఏ లో ఈ చిత్రాన్ని పారామౌంట్ పిక్చర్స్ విడుదల చేసింది. ఈ చిత్రం ఐమ్యాక్స్, 4డీఎక్స్, స్క్రీన్ ఎక్స్, డాల్బీ సినిమా వర్షన్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు ఇటు క్రిటిక్స్ నుంచి అటు ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. అంతకు ముందు వచ్చిన టాప్ గన్ కంటే టాప్ గన్: మావెరిక్ బాగుందని అందరూ చెప్పారు. ఓవైపు కొవిడ్-19 ప్యాండెమిక్ ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా 1.4 బిలియన్ డాలర్లు వసూలు చేసి టామ్ క్రూజ్ సినీ కెరీర్ లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే 2022 లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండో చిత్రంగా టాప్ గన్: మావెరిక్ నిలిచింది.












