Home News LED TV పేలి టీనేజర్ మృతి, ఘజియాబాద్ లో ఘటన

LED TV పేలి టీనేజర్ మృతి, ఘజియాబాద్ లో ఘటన

హైలైట్స్:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక ఎల్ఈడీ టీవీ పేలడంతో 16 ఏళ్ళ బాలుడు మృతి చెందాడు. ఈ పేలుడు సంభవించినప్పుడు మృతుడు, తన స్నేహితుడితో కలిసి టీవీ చూస్తున్నాడు. ఈ ఘటనలో బాలుడి తల్లితో పాటు స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. పేలుడుకి గల అసలు కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

వోల్టేజీ లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడం వల్లన పేలుడు సంభవించిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మృతుడు తన స్నేహితుడితో కలిసి టీవీలో సినిమా చూస్తున్నాడని, తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

టీనేజర్ ని ఓమేంద్ర గా గుర్తించారు. పేలుడు దాటికి అతడికి తీవ్రగాయాలవ్వగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎల్ఈడీ స్క్రీన్ యొక్క సన్నని గాజు ముక్కలు బాలుడి ముఖంపై వేగంగా వచ్చి గుచ్చుకున్నాయని తెలుస్తోంది. ఈ పేలుడు ఉదంతంలో మృతుడి తల్లి, స్నేహితుడికి కూడా గాయాలైనట్లు సమాచారం. భారీగా పేలుడు జరిగిన శబ్ధం వినిపించిందని, సిలిండర్ పేలి ఉంటుందని భావించినట్లు ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఏమైందని వెళ్ళి చూడగా, ఇంట్లో ముగ్గురు గాయాలతో కిందపడి ఉండటం గమనించామని వారు చెప్పారు.

బ్లాస్ట్ తీవ్రత చాలా ఎక్కువేనని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి గోడపై పెద్ద రంద్రం పడిందని వారు చెప్పారు. పేలుడుని ప్రేరేపించే వేరే ఇతర వస్తువేది ఇంట్లో లేదని అగ్నిమాపక విభాగం అధికారులు స్పష్టం చేశారు. అయితే, తమ ప్రాంతంలో తరచూ వోల్టేజీ హెచ్చు తగ్గులు సర్వసాధారణమని నివాసితులు చెప్పారు.

పేలిన ఎల్ఈడీ టీవీ మోడల్, కంపెనీ పేరు ఇంకా తెలియలేదు. ఘజియాబాద్ లోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ వర్గాలను సంప్రదించినప్పటికీ టీవీకి సంబంధించిన వివరాలు తెలియలేదు.

ఒక ఎల్ఈడీ టీవీ పేలడమనేది అసాధారణ విషయమని చెప్పాలి. గతంలో జరిగిన సందర్భాలు ఎంతో అరుదు. షార్ట్ సర్క్యూట్, వోల్టేజీ ఫ్లక్చుయేషన్, డ్యామేజీ అయిన వైర్లు, రిపేర్లు, లోపంతో ఉన్న కెపాసిటర్లు వంటివి పేలుడికి గల కొన్ని సాధారణ కారణాలని చెప్పవచ్చు. ఏదేమైనా పాడైపోయిన టీవీలను, రిపేర్లతో నెట్టుకొస్తున్న టీవీలను వీలైనంత త్వరగా వదిలించుకుంటే మంచిది. అలాగే మీరు నివసించే ప్రాంతంలో అంతటా వోల్టేజీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం మేలు. లేదంటే ఇటువంటి ఉదంతాలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు పేలడం, నిప్పంటుకోవడం వంటివి చూశాం. ఇప్పుడు ఎల్ఈడీ టీవీ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో తెలియడం లేదు. జాగ్రత్తగా ఉండండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.