హైలైట్స్:
- కస్టమర్ల సెన్సిటివ్ డేటాను బహిర్గతం చేసిందంటూ వీఐ పై సైబర్ సెక్యూరిటీ రీసెర్చి కంపెనీ సైబర్ఎక్స్9 (CyberX9) ఆరోపణలు
- కాల్ లాగ్స్, ఎస్ఎమ్ఎస్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూసేజ్ వివరాలు, తదితర డేటా లీకైనట్లు సమాచారం
- డేటా బయటకు పొక్కలేదని కుండబద్ధలు కొట్టిన టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi)
తన కస్టమర్ల పర్సనల్ డేటాను దుర్వినియోగం చేసినట్లు తాజాగా వొడాఫోన్ ఐడియా కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. 20.6 మిలియన్ పోస్ట్ పెయిడ్ యూజర్ల యొక్క డేటా గత రెండేళ్ళుగా లీక్ అవుతోందని ఆరోపణల సారాంశం. ఈ డేటాలో కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్ ఇన్ఫో, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు సైబర్ సెక్యూరిటీ రీసెర్చి కంపెనీ సైబర్ఎక్స్9 నివేదికను వెలువరించింది.
ఇది నిజంగా వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. వీఐ పోస్ట్ పెయిడ్ నంబర్లను వాడుతోన్న వినియోగదారుల కాల్ డీటెయిల్స్ బహిర్గతమయ్యాయి. కంపెనీ చేసిన పొరబాటు వల్లనే కస్టమర్ల యొక్క ఇతర డేటా కూడా బయటకు వచ్చిందని, సైబర్ ఎక్స్ 9 కంపెనీ తన రిపోర్ట్ లో పేర్కొంది. యూజర్ల యొక్క కాలింగ్ టైమ్, కాల్ డ్యూరేషన్, కాల్ వెళ్ళిన లొకేషన్, కస్టమర్ యొక్క పూర్తి పేరు, కస్టమర్ యొక్క పూర్తి చిరునామా, కస్టమర్ పంపిన ఎస్ఎంఎస్ వివరాలు (ఎవరికి పంపారు? ఏం పంపారు?), ఏ నంబర్ కి మెసేజ్ వెళ్ళింది? ఇలా కీలకమైన సమాచారం బయటకు వెళ్ళిందని సైబర్ఎక్స్9 కంపెనీ తన నివేదికలో తెలిపింది.
Vodafone Idea పోస్ట్ పెయిడ్ యూజర్ డేటా లీక్
- కాలింగ్ టైమ్
- కాల్ వ్యవధి
- కాల్ చేసిన లొకేషన్
- వినియోగదారుని పూర్తి పేరు
- వినియోగదారుని పూర్తి చిరునామా
- ఎస్ఎంఎస్ వివరాలు
- మెసేజెస్ పంపబడిన కాంటాక్ట్ నంబర్స్
Vi యూజర్ల డేటా ఎలా లీకైంది?
సైబర్ఎక్స్9 రిపోర్ట్ ప్రకారం, వీఐ పోస్ట్ పెయిడ్ యూజర్ల డేటా సదరు కంపెనీలో ఉన్న లోపాల వల్లనే జరిగిందని తెలుస్తోంది. పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ సిస్టమ్ ఈ డేటా లీక్ కి మూల కారణమని సమాచారం. రిపోర్ట్ ని బట్టి, రమారమీ రెండేళ్ళ నుంచి డేటా లీక్ అవుతూ వస్తోందట. ఇప్పటికే హ్యాకర్లు ఈ డేటాను దొంగిలించి, దుర్వినియోగం చేసి ఉంటారని సైబర్ ఎక్స్9 తెలిపింది. తాము ఇంతకు ముందే ఈ డేటా లీక్ పై వొడాఫోన్ ఐడియాను హెచ్చరించినట్లు సైబర్ఎక్స్9 కంపెనీ ఎండీ హిమాన్శు పాఠక్ అన్నారు.
Vodafone Idea స్పందన
డేటా లీక్ ఆరోపణలపై టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ ఐడియా స్పందించింది. బిల్లింగ్ సిస్టమ్ లో లోపాలను గుర్తించిన వెంటనే సరిచేశామని వీఐ తెలిపింది. అలాగే కస్టమర్స్ డేటా పూర్తి భద్రంగా ఉందని వీఐ స్పష్టం చేసింది. తమ ఐటీ విభాగం ఎంతో బలమైనదని, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ని మరింత బలోపేతం చేస్తామని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ప్రముఖ టెలీకామ్ కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా పై డేటా లీక్ ఆరోపణలు రావడం, వచ్చిన నివేదికలు ఆరోపణలను బలపరుస్తుండటంతో, సదరు కంపెనీకి ఇదొక మచ్చ తెచ్చినట్లైంది. ఏదేమైనా వొడాఫోన్ ఐడియా ఇకపై తన కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. అందుకు వీఐ ఏం చేస్తుందో చూడాలి.












