హైలైట్స్:
- మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ లో 51,236 మెగాహెర్ట్జ్ అమ్మకంతో ముగిసిన 5జీ వేలం
- రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన రిలయన్స్ జియో
- రూ.43,084 కోట్ల విలువైన 19,867 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన భారతి ఎయిర్టెల్
5జీ వేలం నేపథ్యంలో టెలీకామ్ దిగ్గజ సంస్థల మధ్య వారం పాటు 40 రౌండ్స్ వరకు కొనసాగిన బిడ్డింగ్ వార్ కి తెరపడింది. 10 బ్యాండ్స్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ లో 51,236 మెగాహెర్ట్జ్ (71 శాతం) 5జీ స్పెక్ట్రమ్ అమ్ముడైంది. రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ కొన్న రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. రూ.43,084 కోట్ల విలువైన 19,867 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసి భారతి ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. రూ.18,784 కోట్ల విలువైన 6,228 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసి వొడాఫోన్ ఐడియా మూడోస్థానంలో నిలిచింది. ఇక కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్వర్క్స్ రూ.212 కోట్ల విలువైన 400 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. వేలం ద్వారా ప్రభుత్వానికి 5జీ వేలం ద్వారా బిడ్స్ రూపంలో రూ.1,50,173 కోట్ల మొత్తం సమకూరింది.
10 బ్యాండ్స్ లో ప్రభుత్వం స్పెక్ట్రమ్ ని ఆఫర్ చేసింది. అయితే మొత్తం బిడ్డింగ్ 3,300 మెగాహెర్ట్జ్ మరియు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ కోసం జరిగింది. ఇక వేలంలో 700 మెగాహెర్ట్జ్ కి అయితే భారీ డిమాండ్ కనిపించింది. 600 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 2,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ కైతే ఎవరు కూడా బిడ్స్ వేయలేదు. ప్రభుత్వానికి తొలి ఏడాది, స్పెక్ట్రమ్ ద్వారా రూ.13,365 కోట్ల పేమెంట్ వస్తుందని, ఇక 5జీ సేవలు అక్టోబర్ లో దేశంలో లాంచ్ అవుతాయని టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
భారీ డిమాండ్ కలిగిన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్, 6 నుంచి 10 కిలోమీటర్ల సిగ్నల్ రేంజ్ ని కలిగి ఉంటుంది. దీనిపైనే రిలయన్స్ జియో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టింది. అలాగే మిగతా బ్యాండ్స్ లలో కూడా స్పెక్ట్రమ్ ని కూడా కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ లో 5జీ సేవలు కల్పించాలనే లక్ష్యంతో జియో 700Mhz పై ఎక్కువగా వెచ్చించింది. ఇక 700 మెగాహెర్ట్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కనుక వాడినట్లైతే ఒకే ఒక్క టవర్ తో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయవచ్చు. ఇక జియోకి గట్టి పోటీదారు అయిన మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ 3.3-3.67 గిగాహెర్ట్జ్ మరియు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ లలో 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. ఇక 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీస్ లో ఎంతో సెలెక్టివ్ గా కొనుగోళ్ళు జరిపింది.
ఇప్పుడు వొడాఫోన్ ఐడియా జరిపిన లావాదేవీలను గురించి తెలుసుకుందాం. మిడ్-బ్యాండ్ 5జీ స్పెక్ట్రమ్ లో 3300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ని 17 సర్కిల్స్ కొరకు, 16 సర్కిల్స్ లో 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ని వీఐ కొనుగోలు చేసింది. ఇక ప్రైవేట్ టెలీకామ్ నెట్వర్క్ ను సెటప్ చేయడానికి అదాని గ్రూప్ 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ లో స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది.