హైలైట్స్:
- ఫ్లిప్ కార్ట్ ద్వారా తమ ఈ-స్కూటర్లను విక్రయించాలనుకుంటోన్న ఆంపియర్ సంస్థ
- ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో మొదలైన ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ అమ్మకాలు
- ఆర్డర్ చేసిన 15 రోజులకు డెలివరీ కానున్న ఈ-స్కూటర్
ఆంపియర్ వెహికిల్స్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకానికి తీసుకు వచ్చింది. తొలిదశ లో కంపెనీ ఎంపిక చేయబడిన నగరాలకు, ఆంపియర్ డీలర్షిప్స్ కి డెలివరీ చేయనుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క బ్రాండ్ అయిన ఆంపియర్ ఫ్లిప్ కార్ట్ ద్వారా దేశంలో తన నెట్వర్క్ ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫ్లిప్ కార్ట్ పై సేల్ కి తెచ్చిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ 80 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. అలాగే ఈ బండి మొత్తం 5 రంగుల్లో లభించనుంది.
Flipkart ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మనున్న Ampere Vehicles
ఫ్లిప్ కార్ట్ తో చేతులు కలుపుతున్నట్లు గతంలో ఆంపియర్ వెహికిల్స్ వెల్లడించింది. తద్వారా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ఈ-కామర్స్ దిగ్గజం యొక్క ప్లాట్ఫామ్ పై తన స్కూటర్లను విక్రయించనుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ఎలక్ట్రిక్ సబ్-డివిజన్ అయిన ఆంపియర్ వెహికిల్స్, ఫ్లిప్ కార్ట్ పై ఆంపియర్ స్కూటర్లను అమ్మడం మొదలు పెట్టింది. ఇక ఇతర ఆంపియర్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తర్వాత సేల్ కి రానున్నాయి.
భారత్ లో Ampere Magnus EX ధర, స్పెసిఫికేషన్స్
ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ 100 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ ని సాధించింది. అలాగే ఈ స్కూటర్ లో తొలగించగలిగిన, మార్చుకోగలిగిన బ్యాటరీ ఉంది. సున్నా నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని 10 సెకన్లలో అందుకోనుంది. అలాగే ఈ బండి టాప్ స్పీడ్ 50 కేఎంపీహెచ్ గా ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 38.25 ఏహెచ్ అడ్వాన్స్డ్ లిథియమ్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్లు వ్యారంటీ ఉంది. ఇక ఈ స్కూటర్ లో ఉన్న మోటర్ 1.2 కిలోవాట్ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది.
గ్రాఫైట్ బ్లాక్, గెలాక్టిక్ గ్రే, మెటాలిక్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో ఈ స్కూటర్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.77,249 గా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. తొలుత ఆంపియర్ తన సేవలను బెంగళూరు, జైపూర్, కోల్ కతా, పూణె నగరాల్లో అందించనుంది. తర్వాత దేశం లోని ఇతర నగరాలకు తన అమ్మకాలను విస్తరిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తో జట్టుకట్టడం సంతోషంగా ఉందని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో సంజయ్ బెహల్ చెప్పారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఎక్కువ మంది కస్టమర్లకు చేరువవుతామని బెహల్ తెలిపారు. క్లీన్, గ్రీన్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్, లాస్ట్-మైల్ మొబిలిటీ ఎక్స్‌పీరియన్స్ ను యూజర్లకు అందించడమే తమ లక్ష్యమని బెహల్ చెప్పారు.













