హైలైట్స్
- ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీ
- చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్ పోతినేని, కృతిశెట్టి
- తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలై నిరాశ పరిచిన సినిమా. ప్రస్తుతం హిందీ డబ్బింగ్ వర్షన్ కి భారీ స్పందన.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలె ది వారియర్ అనే సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం ఇటు తెలుగు, అటు తమిళంలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో థియెట్రికల్ రన్ ముగించుకుని, వెంటనే ఓటీటీ లోకి వచ్చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
విచిత్రమేంటంటే, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులు పెదవి విరిచారు కానీ, హిందీ జనాలు మాత్రం వారియర్ ని ఆదరిస్తున్నారు. ఇటీవలె ది వారియర్ హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. భారీ వ్యూస్, లైక్స్ సాధించిన ది వారియర్ వారెవా అనిపిస్తోంది.
‘ది వారియర్’ హిందీ డబ్బింగ్ వర్షన్ కి యూట్యూబ్ లో భారీ స్పందన
రామ్ పోతినేని నటించిన ది వారియర్ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ వర్షన్ ఇటీవలె యూట్యూబ్ లో విడుదలైంది. విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మేకర్స్ ని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, ఈ మూవీకి యూట్యూబ్ లో 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. వెండితెరపై మెరుపులు మెరిపించలేకపోయిన ది వారియర్ యూట్యూబ్ లో మాత్రం ప్రభంజనం సృష్టించింది. మొత్తానికి రామ్ కి యూట్యూబ్ ద్వారా హిందీ ఆడియన్స్ మూలంగా భారీ హిట్ లభించినట్లైంది.
చిత్ర నటీనటులు:
ది వారియర్ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పథాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. కథను అందించిన ఎన్ లింగుసామి చిత్ర దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతిశెట్టి, అక్షర గౌడ, నదియ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సుజిత్ వాసుదేవ్ కెమెరామెన్ గా పని చేయగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
చిత్ర కథ:
కర్నూలు నగరంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సత్య అనే పోలీసు అధికారి, స్థానిక గూండా గురుని ఎలా ఎదుర్కున్నాడన్నదే చిత్ర ప్రధాన కథ. అయితే ఈ చిత్రంలో హీరో ఒక డాక్టర్, కానీ వ్యవస్థను బాగు చేసేందుకు పోలీసుగా మారతాడు. కథలో విలన్ పాత్ర పోషించిన ఆది పినిశెట్టి, మర్డర్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటుతుంటాడు. సినిమాలో ఇదొక రకం ఆకర్షణ. ఇక కథానాయిక కృతిశెట్టి రేడియో జాకీ గా చేసింది. విజయ్ మహాలక్ష్మి పాత్రలో కృతి మెప్పించింది. అక్షర గౌడ, నదియా తమ పాత్రలకు న్యాయం చేశారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













