రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ లో ప్రసారం కానున్న ‘డేగల బాబ్జీ’

హైలైట్స్:

  • బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన డేగల బాబ్జీ చిత్రం
  • అవార్డ్ గెలుచుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ ‘డేగల బాబ్జీ’
  • రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆహా ఓటీటీ లో ప్రసారం కానున్న చిత్రం

నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం డేగల బాబ్జీ. ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి డేగల బాబ్జీ తెలుగు రీమేక్. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితం రాబట్టలేదు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ చిత్రం ఓటీటీ ప్రసారానికి వస్తోంది. బండ్ల గణేశ్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, మరెంత అభిమానమో మన అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఎన్నో సినిమా వేడుకల్లో బండ్ల గణేశ్ తన ప్రసంగాలతో నిరూపించుకున్నారు. పవన్ గురించి బండ్ల గణేశ్ ఇచ్చే స్పీచ్ లకు అభిమానుల్లో ఎనలేని క్రేజ్ ఉంది. యూట్యూబ్ లో బండ్ల స్పీచ్ లకు లక్షల్లో వ్యూస్ ఉండటమే అందుకు నిదర్శనం.

AHA ఓటీటీ లో రేపటి నుంచి స్ట్రీమ్ కానున్న డేగల బాబ్జీ

పురస్కారం గెలిచిన తమిళ చిత్రం ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రానికి తెలుగు రీమేక్ గా వస్తోన్న డేగల బాబ్జీ చిత్రం రేపు ఆహా ఓటీటీ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ అవ్వనుంది. ఒత్త సెరుప్పు లాగానే, డేగల బాబ్జీ లో కూడా ఒకే నటుడు ఉంటాడు. సినిమాలో బండ్ల గణేశ్ తన నట విశ్వరూపం చూపించారు. ఆ విషయం డేగల బాబ్జీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చిత్ర కథ: వరుస నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. విచారణలో భాగంగా నేరస్తుడిని ప్రశ్నస్తారు. అప్పుడు అతడు ఇచ్చిన సమాధానాలతో పచ్చి నిజాలు బయట పడతాయి.

ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రానికి కథను సమకూర్చిన నటుడు ఆర్ పార్థీబన్, తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహించారు. ఒత్త సెరుప్పు చిత్రానికి జాతీయ పురస్కారం దక్కడంతో పాటు, ఆర్ పార్థీబన్ కు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఇటువంటి చిత్రాలు చాలా అరుదు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ చిత్రం ఓటీటీ లో సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి.

సినిమాలో బండ్ల గణేశ్ ఒక్కడే నటుడు కాగా, ఇతర వాయిసెస్ కూడా వినిపిస్తుంటాయి. వెంకట్ చంద్ర ‘డేగల బాబ్జీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వాతి ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైనస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ చిత్రం ఎటువంటి స్పందనను రాబడుతుందో చూడాలి.

లేటెస్ట్ ఎంటర్టెయిన్మెంట్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.