రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్

హైలైట్స్:

  • రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం
  • భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి
  • ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం

రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో మంచి రాబడినే రాబడుతోన్న వివో, ఒప్పో, షావోమీ లపై ప్రభుత్వ నిర్ణయం సంకటంగా మారనుందని అంతా భావించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. రూ.12,000 లోపు ధర కలిగిన ఫోన్లను బ్యాన్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పింది. దీంతో చైనాకు చెందిన బ్రాండ్స్ కి ఉపశమనం లభించినట్లైంది.

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎకో సిస్టెమ్ కి భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నది వాస్తవమే కానీ, దానర్థం విదేశీ బ్రాండ్లను తొలగించి భారత కంపెనీలకు బాటలు వేయడం కాదని రాజీవ్ స్పష్టం చేశారు.

భారత్ లో రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లు రద్దు కావు

భారత్ లో అమ్ముడవుతోన్న రూ.12,000 లోపు ధర గల చైనా బ్రాండ్స్ ఫోన్ల బ్యాన్ పై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. “మేము లేవనెత్తిన ఇష్యూ విషయంలో ఎంతో పారదర్శకతతో వ్యవహరించాం. అదే విషయాన్ని చైనీస్ బ్రాండ్స్ కి స్పష్టం చేశాం. చైనా బ్రాండ్ల నుంచి మేం ఆశించేది ఏంటంటే వారు మరింత ఎగుమతులు పెంచుతారని. వారి సప్లై చైన్, ప్రత్యేకించి కంపోనెంట్స్ చైన్, ఎంతో పారదర్శకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది,” అని చంద్రశేఖర్ అన్నారు.

రూ.12,000 సెగ్మెంట్ ఫోన్స్ విషయమై క్లారిటీ ఇస్తూ, “మా వద్ద అటువంటి ప్రపోజల్ లేదు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.” రూ.12,000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని భారత్ బ్యాన్ చేయనుందని బ్లూంబర్గ్ ఓ కథనం వెలువరించాక ఈ రభస మొదలైంది. బ్యాన్ ద్వారా లావా, జియో, మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ బ్రాండ్లకు ఊతమివ్వాలని భారత్ భావిస్తోందని బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఇక భారత్ లో రూ.12,000 సెగ్మెంట్ లో చైనీస్ బ్రాండ్స్ ఆదిపత్యం కొనసాగుతోన్న విషయం గమనించాలి.

ఫోన్స్ ని బ్యాన్ చేయడం లేదు కానీ, భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఓ కన్నేసి ఉంటోంది. ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై రైడ్స్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వీటి కదలికలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి పలు బ్రాండ్స్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీల దిగుమతులు, ఎగుమతులు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. చైనాకు చెందిన యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2020 లో 50 చైనీస్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ యాప్స్ టిక్ టాక్, పీయూబీజీ ఉన్నాయి.

Previous articleరేపటి నుంచి ప్రముఖ ఓటీటీ లో ప్రసారం కానున్న ‘డేగల బాబ్జీ’
Next articleRedmi 11 Prime 5G తో పాటు లాంచ్ కానున్న Redmi 11 Prime 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.