BSNL కి 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

హైలైట్స్:

  • బీఎస్ఎన్ఎల్ కి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
  • 4జీ సేవల కోసం రూ.1.64 లక్షల కోట్లు కేటాయింపు
  • ఒక్కటైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరియు భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్

బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు సంబంధించిన ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ కి మంచి రోజులు రావడం ఖాయమని తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ కి రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అప్రూవ్ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని నెట్వర్క్ మరియు సర్వీస్ నాణ్యతను పెంచేందుకు బీఎస్ఎన్ఎల్ వినియోగించనుంది. కొత్త ప్రణాళిక ప్రకారం, బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను 24,680 గ్రామాల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా 19,722 కొత్త మొబైల్ టవర్స్ వేయనున్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరియు భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ల యొక్క కలయికకు కేంద్ర ప్రభుత్వం సమ్మతం తెలిపింది.

BSNL 4G సేవలు

త్వరలోనే భారత్ లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. జియో, ఎయిర్టెల్, వీఐ వంటి టెలీకామ్ కంపెనీలు 5జీ సేవలను లాంచ్ చేసేందుకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం దేశంలో ఇంకా 4జీ సేవలను ప్రారంభించకపోవడంతో ఇటు బీఎస్ఎన్ఎల్ యూజర్లతో పాటు, ఇతర యూజర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ కంపెనీని నిలబెట్టేందుకు కేంద్ర కేబినెట్ నిన్న పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా, భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని బీఎస్ఎన్ఎల్ కి ప్రకటించింది. దీంతో పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా 4జీ సేవలను విస్తరించాలని బీఎస్ఎన్ఎల్ ప్రణాళిక వేసుకుంది. అందుకోసం త్వరలోనే దేశ వ్యాప్తంగా కొత్త మొబైల్ టవర్లను వేయనుంది.

టెలీకామ్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ద్వారా దేశంలో ఉన్న 24,680 గ్రామాలకు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుతాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో 4జీ సేవలను అందించేందుకు, రూ.26,316 కోట్ల ప్యాకేజీని అప్రూవ్ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 2జీ, 3జీ సేవలకు మాత్రమే పరిమితమైన 6,279 గ్రామాలను ఎంపిక చేసిన 4జీ నెట్వర్క్ నకు అప్‌గ్రేడ్ చేస్తామని అన్నారు. బీఎస్ఎన్ఎల్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి, 4జీ సేవల కోసం 19,722 కొత్త మొబైల్ టవర్స్ ని ఇన్‌స్టాల్ చేయనున్నట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

1.50 లక్షల కోట్ల ఫండ్

భారతదేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ప్యాకేజీని సదరు కంపెనీకి కేటాయించింది. 4జీ సేవల కొరకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకునేందుకు, టెక్నికల్ అప్‌గ్రేడేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ కి 26 వేల కోట్లను అందించనుంది. మారుమూల ప్రాంతాలతో పాటు, గ్రామాల్లో వైర్‌లైన్ సేవల కోసం రూ.13,789 కోట్లను బీఎస్ఎన్ఎల్ కి ఈక్విటీ రూపంలో ఇవ్వనుంది. కేంద్రం నుంచి ఈ సాయం పూర్తయ్యాక, బీఎస్ఎన్ఎల్ కి అందించే ఈక్విటీ బేస్, రూ.40,000 కోట్ల నుంచి రూ.1,50,000 కోట్లకు పెరగనుంది.

ఏదేమైనా, ఇన్నాళ్ళుగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ సాయంతో గౌరవప్రదమైన స్థితికి చేరుకోనుంది. 4జీ సేవలు ప్రారంభమయ్యాక, బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుల కోసం మళ్ళీ కస్టమర్లు క్యూ కడతారనడంలో సందేహం అక్కర్లేదు. పైగా, బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ధరలు ఇతర కంపెనీలతో పోలిస్తే చౌకగా ఉండటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో బీఎస్ఎన్ఎల్ దశదిశ ఏ విధంగా మారబోతుందో వేచి చూద్దాం.

Previous articleరెండు గంటల్లో అమ్ముడైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Volvo XC40 Recharge
Next article777 చార్లీ: Voot ఓటీటీ సైట్ లో రేపే ప్రీమియర్ షో
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.