777 చార్లీ: Voot ఓటీటీ సైట్ లో రేపే ప్రీమియర్ షో

హైలైట్స్:

  • రేపటి నుంచి వూట్ ఓటీటీలో 777 చార్లీ సినిమా ప్రీమియర్
  • ప్రధాన పాత్ర చార్లీ గా నటించిన శునకం, మరో ప్రధాన పాత్రలో కనిపించిన రోహిత్ శెట్టి
  • జంతువులకి, మనిషికి మధ్య ఉండే బంధం నేపథ్యంలో సాగే చిత్ర కథ

కన్నడ సినిమా 777 చార్లీ విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారింది. జంతువులకు మనిషికి మధ్య ఉండే బంధం అనే కథాంశంతో సినిమా రూపొందింది. దీంతో పెట్ లవర్స్ లో ఈ సినిమాపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. సోషల్ మీడియాలో 777 చార్లీ గురించి నెటిజన్లు తెగ చర్చించారు. 777 చార్లీ టీజర్, ట్రైలర్ వచ్చినప్పటి నుంచే, ఇది సాధారణంగా వచ్చి పోయే కమర్షియల్ సినిమా కాదని, ఏదో చక్కటి ప్రయోగంతో సినిమా యూనిట్ రాబోతుందని అందరూ అంచనా వేశారు. వారి అంచనాలను అందుకోవడంలో సినిమా విజయం సాధించింది.

జూన్ 10 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు జులై 28 నుంచి Voot ఓటీటీ సైట్ లో ప్రీమియర్ అయ్యేందుకు రెడీ అయిపోయింది.

జంతువుల మీద తీసే చిత్రాల్లో ఏమాత్రం ఎమోషనల్ టచ్ ఉన్నా అది ఇట్టే జనాలకు కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. సరిగ్గా 777 చార్లీ విషయంలో అదే జరిగింది. గతంలో ఏనుగులు, గుర్రాల మీద సినిమాలు వచ్చాయి. పెట్ డాగ్స్ పై సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు 777 చార్లీ మాత్రం హృదయాలకు హత్తుకు పోయేలా ఉంది. మరి ఈ చిత్ర కథ ఏంటి, నటీనటులు ఎలా చేశారు అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

చిత్ర కథ:

ధర్మ (రక్షిత్ శెట్టి) తన కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా జీవిస్తుంటాడు. అతడు తన జీవితంలో ఒక చిరునవ్వు, సంతోషం వంటివి ఏమీ లేనట్లుగా యాంత్రిక జీవితం గడుపుతుంటాడు. పక్కవారితో కలిసిపోయే స్వభావి కాదు. ఉద్యోగం, తాగడం, తినడం, పడుకోవడం ఇదే అతని డెయిలీ రొటీన్ గా ఉంటుంది. అలాంటి అతని జీవితంలోకి ఉన్నట్లుండి ఒక కుక్క (చార్లీ) వస్తుంది. చార్లీ వచ్చాక ధర్మ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? చార్లీ, ధర్మకు ఎందుకు దగ్గరైంది? చార్లీ కోసం ధర్మ ఏం చేశాడు? చివరకు చార్లీకి ఏమైంది? తెలియాలంటే 777 చార్లీ సినిమా చూడాల్సిందే.

హీరోగా నటించిన రక్షిత్ శెట్టి అద్భుతంగా నటించాడు. ఇక చార్లీ పాత్రలో కుక్క తన చేష్టలతో నవ్వులు పూయించింది. పలు సందర్భాల్లో కన్నీళ్ళు కూడా పెట్టించింది. చార్లీ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. రాజ్ బీ శెట్టి, అభిజిత్ మహేశ్ బలమైన కథను అందించి వారే వాహ్ అనిపించారు. ఇక ఇంత హృద్యమైన కథను జనాలకు చేరువ చేయడంలో దర్శకుడు కిరణ్ రాజ్ విజయం సాధించారు.

కుక్కల గురించి దర్శకుడు బాగా చూపించారు. సమాజంలో కుక్కల పట్ల విభిన్న భావనలు ఉంటాయి. కొందరు వాటిని ఇష్టపడే వారైతే, మరికొందరు ద్వేషిస్తారు, ఇంకొందరు కుక్కల కోసం పని చేస్తూ తమ అభిరుచికి దగ్గరగా బ్రతుకుతుంటారు. వీటిని బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు సన్నివేశాలను చూపిన విధానం ఆకట్టుకుంటుంది. చార్లీ మన హీరోకి చేరువవుతుంది, కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తుంది. కానీ చివర్లో హీరో ధర్మ మాత్రం చార్లీని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకుంటాడు. మరి అందుకు గల కారణమేంటి? నిజంగానే దత్తత ఇచ్చేస్తాడా? అసలేం జరుగుతుంది? ఈ విషయాలను తెలియాలంటే Voot డిజిటల్ ప్లాట్ఫామ్ పై 777 చార్లీ సినిమాను తప్పక చూడండి.

Previous articleBSNL కి 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Next articleభారత్ లో బ్యాన్ అయిన BGMI గేమ్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.