
ఫిన్‌ల్యాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు HMD తాజాగా భారతీయ మార్కెట్ లో కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. HMD 105 4G, HMD 110 4G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్స్, క్లౌడ్ ఫోన్ యాప్, యూపీఐ వంటి ఫీచర్లతో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?
HMD 105 4G, HMD 110 4G ధర, లభ్యత
HMD 105 4G ధరను రూ.2,199 గా పెట్టారు. ఈ ఫోన్ బ్లాక్, సైయన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు, HMD 110 4G ఫోన్ ధరను రూ.2,399 గా పెట్టారు. ఈ ఫోన్ టైటానియమ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ సైట్స్ మరియు హెచ్ఎండి.కామ్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లకు కంపెనీ 1 ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీని ఆఫర్ చేస్తోంది.
ఇక ఇదివరకే లాంచైన, HMD 110, HMD 105 ఫోన్లు 2జీ సపోర్ట్ తో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లలో 1.77-ఇంచ్ స్క్రీన్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. నోకియా 110 ధరను రూ.1,599 గా పెట్టారు. నోకియా 105 ధరను రూ.1,199 గా పెట్టారు.
HMD 105 4G, HMD 110 4G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: హెచ్ఎండి 105 4జీ, హెచ్ఎండీ 110 4జీ ఫోన్లలో 2.4-ఇంచ్ ఐపీఎస్ క్యూవీజీఏ స్క్రీన్ ఉంది.
బ్యాటరీ: ఈ రెండు ఫోన్లలో 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లు 11.8 గంటల టాక్‌టైమ్, 386 గంటల స్టాండ్‌బై టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది.
చిప్సెట్: ఈ ఫోన్లలో యూనిఎస్ఓసీ టీ127 చిప్సెట్ వాడారు. ఓఎస్ విషయానికి వస్తే, ఆర్టీఓఎస్ ను ఈ ఫోన్లలో అందించారు.
కెమెరా: హెచ్ఎండి 110 4జీ లో క్యూవీజీఏ రియర్ కెమెరా, హై-పవర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు. 105 4జీ ఫోన్లో కెమెరా ఇవ్వలేదు.
ఇతర ఫీచర్లు: రెండు ఫోన్లలో ఎంపీ3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, 32జిబి ఎస్డీ కార్డ్ సపోర్ట్, 23 భాషల్ సపోర్ట్, 13 ఇన్‌పుట్ లాంగ్వేజెస్, టైప్-సీ పోర్ట్, 3-ఇన్-1 స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: హెచ్ఎండి 110 4జీ బరువు 84.5 గ్రాములు కాగా, హెచ్ఎండి 105 4జీ బరువు 80.2 గ్రాములు. రెండు ఫోన్లు కూడా 121 మి.మీ పొడవు, 50 మి.మీ వెడల్పు, 14.5 మి.మీ మందం ఉంటాయి.
రెండు ఫోన్లలో వైర్లెస్ ఎఫ్ఎమ్ ఫీచర్ అందించారు. అంటే మీరు హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేయకుండానే ఎఫ్ఎమ్ రేడియో వినవచ్చు.
ఈ రెండు కొత్త హెచ్ఎండి ఫోన్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది. అంటే యూపీఐ పేమెంట్స్ చేసేందుకు మీకు స్మార్ట్‌ఫోన్ అక్కర్లేదన్నమాట. 4జీ కనెక్టివిటీ సాయంతో, ఎక్కడైనా మీరు క్యూఆర్ కోడ్ పై పేమెంట్స్ చేయవచ్చు.











