హైలైట్స్:
- ఇటీవలె భారత్ లో హానర్ వాచ్ జీఎస్ 3 ని లాంచ్ చేసిన హానర్
- తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హానర్ సీఈవో సంచలన ప్రకటన
- భారత మార్కెట్ నుంచి వైదొలిగినప్పటికీ, భాగస్వామ్యాలను కొనసాగిస్తామని సీఈవో జావో మింగ్ ప్రకటన
హానర్ సీఈవో జావో మింగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత మార్కెట్ నుంచి వైదొలిగామని ప్రకటించినట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా భారత మార్కెట్ లో కొనసాగామని, ఇప్పుడు హానర్ టీమ్ ఇండియన్ మార్కెట్స్ నుంచి తప్పుకుంటోందని మింగ్ చెప్పారు. అయితే, కంపెనీ తమ భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తామని మింగ్ తెలిపారు. భారత మార్కెట్ లో కూడా హానర్ కు బాగానే లాభాలు వచ్చాయి. కంపెనీ భవిష్యత్తులో భారత మార్కెట్ లోకి మళ్ళీ ప్రవేశించే అవకాశమున్నట్లు సమాచారం.
ఐటీ హోమ్ వెబ్ సైట్ హానర్ కంపెనీ భారత్ నుంచి వైదొలిగినట్లు తన కథనం లో పేర్కొంది. ఇక చివరగా మార్చి, 2021 లో హోలీ పండుగ సందర్భంగా తన అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. మార్కెట్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ, హానర్ ఇప్పటి వరకు ఇచ్చిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటుందని మింగ్ చెప్పారు. గత కొన్ని నెలల కాలంలో, హానర్ నుంచి పలు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, నోట్ బుక్స్ వంటి ఎన్నో ఉపకరణాలు భారత్ లో లాంచ్ అయ్యాయి.
ఇటీవలె హానర్ భారత్ లో హానర్ వాచ్ జీఎస్3 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంది. 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ కూడా ఇందులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో ఈ వాచ్ 14 రోజులు వరకు నిరవధికంగా పని చేస్తుంది. ఈ వాచ్ మిడ్ నైట్ వేరియంట్ ధర రూ.12,990. ఓషియన్ బ్లూ, క్లాసిక్ గోల్డ్ వాచెస్ ధర రూ.14,990.
హువావే సబ్-బ్రాండ్ అయిన హానర్ గ్లోబల్ గా హానర్ ఎక్స్8 5జీ ఫోన్ ని శుక్రవారం నాడు లాంచ్ చేసింది. దీని ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ, 6జిబి ర్యామ్, 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవకాశాలు దాదాపుగా లేనట్లే.
అలాగే హానర్ సీఈవో మింగ్ తమ కంపెనీ యొక్క భవిష్యత్ ప్లాన్స్ గురించి తెలిపారు. వచ్చే కొన్నేళ్ళ వరకు తమ కంపెనీకి కార్లు తయారు చేసే ఉద్దేశ్యం ఏదీ లేదని మింగ్ స్పష్టం చేశారు. ఇటీవల స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ, ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. షావోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు 2024 లో తయారు కానుంది. ఈలోపు 2022 లో తమ కారు యొక్క ప్రోటోటైప్ ను జనాల ముందుకు తీసుకురావాలని షావోమీ లక్ష్యంగా పెట్టుకుంది.












