iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్: ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

  • ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసిన ఆపిల్
  • ఏ15 బయోనిక్ చిప్సెట్, ఏ16 బయోనిక్ చిప్సెట్, 48ఎంపి, 12ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీ 14-సిరీస్ ప్రధాన ఫీచర్లు
  • ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700)

బుధవారం జరిగిన ఫార్ ఔట్ ఈవెంట్ లో, ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను లాంచ్ చేసింది. అంచనా వేసినట్లుగానే, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది విడుదలైన ఐఫోన్ 13 కి ఈ ఫోన్స్ సక్సెసర్స్ గా వచ్చాయి. అయితే, ఈసారి మినీ ఐఫోన్ కి బదులు అతిపెద్ద ఐఫోన్ ప్లస్ ని తీసుకురావడం పెద్ద మార్పని చెప్పాలి. 6.7 అంగుళాల ఐఫోన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై ఎక్కువ మొత్తం చెల్లించకుండానే పెద్ద సైజు ఐఫోన్ 14 ప్లస్ ని ఎంచుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మైనర్ అప్‌గ్రేడ్ లతోనే వచ్చాయి. బ్యాటరీ, కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ని గమనించవచ్చు. ఐఫోన్ 13 లో వాడిన ఏ15 బయోనిక్ చిప్ నే వీటిలోనూ వాడారు.

iPhone 14, iPhone 14 Plus ధర, విక్రయ తేదీ

ఐఫోన్ 14 128జిబి వర్షన్ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700), ఐఫోన్ 14 ప్లస్ 128జిబి మోడల్ ధర 899 డాలర్లు (దాదాపు రూ.71,700). ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లను సెప్టెంబర్ 9 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి ప్లస్ వేరియంట్ స్టోర్స్ కి వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ అయిన ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుంచి విక్రయానికి వస్తోంది. త్వరలోనే భారత్ లో ధరల వివరాలను వెల్లడిస్తాం.

iPhone 14, iPhone 14 Plus స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

ఐఫోన్ 14 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అమర్చారు. ఐఫోన్ 14 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. ఇక రెండు ఫోన్లు కూడా స్లిమ్ బెజెల్స్, వైడ్ కలర్ గేముత్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ట్రూ టోన్ రెగ్యులర్ నాచ్, ఫ్రంట్ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సర్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉన్నాయి.

రెండు ఫోన్లలో 5ఎన్ఎం ప్రాసెస్ పై నిర్మితమైన ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంది. 4జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఐఓఎస్ 16 స్టేబుల్ వర్షన్ పై ఈ ఫోన్లు పని చేస్తాయి. 5జీ, వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్, జీపీఎస్, లైట్నింగ్ పోర్ట్, వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి.

ఐఫోన్ 14, 14 ప్లస్ లలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సర్ (ఐఓఎస్), రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఆటోఫోకస్ తో కూడిన 12ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు. తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటోఫోకస్ ని అందించారు. రియర్ కెమెరా 38 శాతం మెరుగైన లో-లైట్ పెర్ఫామెన్స్ ని అందిస్తుందని, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందని ఆపిల్ చెబుతోంది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్స్ హై-డైనమిక్ రేంజ్ జైరోస్కోప్, డ్యూయల్-కోర్ యాక్సెలరోమీటర్, క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తో వస్తున్నాయి. ఈ సిరీస్ లో శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ ని అందించారు. ఏ మొబైల్ నెట్వర్క్ లేకపోయినా నేరుగా శాటిలైట్ తో కనెక్ట్ అయి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు.