500km రేంజ్ తో భారత్ లో లాంచ్ అయిన Pravaig Defy ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన Pravaig Defy ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు
  • Pravaig Defy ప్రత్యేకతలు: 90.9 కిలోవాట్ 5-మాడ్యూల్ లిథియమ్ అయాన్ బ్యాటరీ, 500 కిలోమీటర్ల రేంజ్
  • Pravaig Defy ప్రారంభ ధర: రూ.39.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

భారత ఎలక్ట్రిక్ కార్స్ సెగ్మెంట్ రోజురోజుకీ పుంజుకుంటోంది. జనాలు ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో దేశం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలతో నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంప్రదాయ ఇంధనాల ధర పెరగడం, సమీప భవిష్యత్తులో ఆ ఇంధనాల నిల్వలు పడిపోయే అవకాశం ఉండటంతో, ఇప్పటి నుంచే విద్యుత్ఛక్తి ఆధారిత రవాణా వ్యవస్థ వేళ్ళూనుకుంటోంది.

ఇటీవలె భారతదేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు PMV EaS-E లాంచ్ అయ్యింది. దీని ధర దాదాపు రూ.4,50,000 వద్ద ఉంది. అయితే తాజాగా మరొక ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయ్యింది. బెంగళూరుకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ Pravaig Defy అనే ఎస్‌యూవీ ని లాంచ్ చేసింది. Pravaig Dynamics కంపెనీ తమ ఎలక్ట్రిక్ కారు సింగిల్ చార్జ్ పై 500 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందని తెలిపింది. కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అవుతుందని సదరు సంస్థ చెబుతోంది. ఓసారి Pravaig Defy ఎలక్ట్రిక్ కారు యొక్క ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Pravaig Defy ధర

Pravaig Defy కారు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.39.50 లక్షలుగా ఉంది. ఈ కారు యొక్క ఉత్పత్తి వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క సేల్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Pravaig Defy ఫీచర్స్

Pravaig Defy ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లో ఎన్నో అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, Devialet ఆడియో సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, వైర్లెస్ చార్జింగ్ వంటివి ఉన్నాయి. భద్రత కోసం ఈ ఎలక్ట్రిక్ కారులో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, టీపీఎంఎస్, 6 ఎయిర్ బ్యాగ్స్ అందించారు.

Pravaig Defy ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లో రెండు ఎలక్ట్రిక్ మోటర్స్ ఉన్నాయి. ఈ రెండు మోటర్స్ కలిసి 620 నానోమీటర్ టార్క్, 407 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఇంకా ఈ కారులో 90.9 కిలోవాట్ 5-మాడ్యూల్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని 7.2 కిలోవాట్ వరకు చార్జింగ్ స్పీడ్ తో ఆప్షనల్ హోమ్ చార్జర్ తో చార్జ్ చేయవచ్చు. 8 గంటల పాటు చార్జ్ చేస్తు ఈ కారు 300 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం 150 కిలోవాట్ డీసీ చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. కావాల్సిన వారు ఈ చార్జర్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.