హైలైట్స్:
- 5 నెలలు, 12,500 కిలోమీటర్లు; తన ఓనర్షిప్ అనుభవాన్ని పంచుకున్న టాటా టిగోర్ ఈవీ యజమాని
- సౌరశక్తిని వినియోగించి ఖర్చుని సున్నా రూపాయలకు తగ్గించిన యజమాని
- నగరంలో నడపబడిన టాటా టిగోర్ ఈవీ, ఫాస్ట్ చార్జింగ్ చేయబడలేదు

గుజరాత్ లోని అహ్మదాబాద్ కి చెందిన టాటా టిగోర్ ఈవీ ఓనర్ తాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.12,500 కిలోమీటర్లు తిరిగినట్లు వెల్లడించారు. సోలార్ శక్తిని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ప్లగిన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ అనే యూట్యూబ్ చానల్ ద్వారా టాటా టిగోర్ ఈవీ ఓనర్ తన ఓనర్షిప్ అనుభవం, రన్నింగ్, మెయిటెనెన్స్ కాస్ట్ తదితర వివరాలను వెల్లడించారు. వాహనాన్ని చార్జ్ చేయడం కోసం టిగోర్ ఓనర్ సోలార్ పవర్ ని వినియోగించారు. దీంతో పర్యావరణానికి మేలు చేయడమే గాక, కారు నిర్వహణ ఖర్చును చాలా వరకు తగ్గించుకున్నట్లైంది.
రూపాయి ఖర్చు లేకుండా 12,500 కిలోమీటర్లు తిరిగిన Tata Tigor EV ఓనర్
గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నివసించే టిగోర్ ఈవీ ఓనర్ ప్రతిరోజు ఇంటి నుంచి కార్యాలయానికి మొత్తం 60 కిలోమీటర్లు దూరం వెళ్ళి వస్తుంటారు. ఈ దూరంలో సుమారు 90 శాతం మేర నగరం లోపలే ట్రావెల్ చేసినట్లు సదరు ఓనర్ తెలిపారు.
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు పని చేసిన టిగోర్ యజమాని సమర్థ్ జాని స్వతహాగా టాటా నానో, మహీంద్రా థార్ వంటి వాహనాలను కలిగి ఉన్నారు. గతంలో టాటా మోటార్స్ లో పని చేసిన జానీకి ఆ బ్రాండ్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. దీంతో టిగోర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అర్థమవుతోంది.
5 నెలల పాటు టిగోర్ ఈవీ వాహనాన్ని నడిపించిన జానీ తన ఓనర్షిప్ అనుభవాన్ని గురించి మాట్లాడారు. సౌరశక్తిని వినియోగించి జానీ తన కారుని ఎలా చార్జింగ్ చేసేవారో వెల్లడించారు. రెగ్యులర్ గా ఇంటి వద్ద స్లోచార్జింగ్ రొటీన్ ద్వారా తన కారు నిర్వహణ ఖర్చు సున్నా రూపాయలకు పరిమితమైందని చెప్పారు. తన ఇంటిపై 10 కిలోవాట్ అవుట్ పుట్ పవర్ ని జనరేట్ చేసే సోలార్ ప్యానెల్స్ ని ఇన్ స్టాల్ చేసినట్లు ఆయన తెలిపారు. కారుని చార్జ్ చేయడంతోపాటు ఇంటి విద్యుత్ అవసరాలకు కూడా ఈ విద్యుత్ సరిపోతుందని జానీ తెలిపారు.
ఇదివరకు టాటా టిగోర్ ఐసీఈ పెట్రోల్ కారుని వినియోగించిన జానీ, తనకు ఆ కారు డిజైన్ బాగా నచ్చిందని తెలిపారు. అయితే ప్రీమియమ్ ప్రైస్ ట్యాగ్ కి న్యాయం చేకూర్చేందుకు ఇంటీరియర్స్ ని మెరుగుపరచాలని జానీ టాటా కంపెనీకి సూచించారు. నగర పరిధి వినియోగానికి వస్తే, టిగోర్ ఈవీ తనకు కావాల్సిన దాని కన్నా ఎక్కువ పనితనాన్ని చూపుతోందని జానీ చెప్పారు. అధిక మొత్తం ఈ కారుపై వెచ్చిస్తున్నందున, రియర్ ఏసీ వెంట్స్ ని అందిస్తే బాగుండేదని జానీ అన్నారు. భవిష్యత్తులో టాటా ఆ పని చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. స్పిరిటెడ్ డ్రైవింగ్ స్టైల్ కి టిగోర్ ఈవీ లో ఉన్న ఎకనామికల్ టైర్స్ సరిపోవని జానీ చెప్పారు.
టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ లకు మధ్య నెలకొన్న కామన్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడిన జానీ.. ఎస్‌యూవీ భారీ డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం చేత, సెడాన్ అయిన టిగోర్ ఈవీ తో పోల్చితే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పై అధిక ఒత్తిడి పడుతుందన్నారు. దాంతో పాటు రూ.3 లక్షల లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న ధర వ్యత్యాసం తన వాడుక శైలికి న్యాయం చేకూర్చలేదని జానీ చెప్పారు.
టాటా మోటార్స్ ఇటీవలె తన కార్ల ధరలను పెంచింది. ప్రస్తుతం టాటా టిగోర్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి మొదలవుతోంది. కాగా, టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.











