హైలైట్స్:
- ఆహా ఓటీటీ లో ఆగస్టు 19 నుంచి ప్రసారమవుతోన్న క్రైమ్ త్రిల్లర్ హైవే
- బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టిన సైమన్ కే కింగ్
- ప్రధాన పాత్రలు పోషించిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్. దర్శకత్వం వహించిన కేవీ గుహన్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో హైవే చిత్రం రూపొందింది. సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో నేరుగా ఈ సినిమా విడుదలైంది. మలయాళ నటి మానస రాధాకృష్ణన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. సయామీ ఖేర్ హైవే లో కీలక పాత్ర పోషించింది. సైకో కిల్లర్ గా అభిషేక్ బెనర్జీ నటించాడు.
చిత్ర కథ
దాస్ అనే సైకో కిల్లర్ హైదరాబాద్ లో ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేస్తాడు. ఏ ఉద్దేశ్యం లేకుండా రాక్షసానందం కొరకు హత్యలు చేస్తూ పోతుండటంతో, పోలీసులకు ఇదొక మిస్టరీగా పరిణమిస్తుంది. ఆశా భరత్ (సయామీ ఖేర్) ఇన్వెస్టిగేషన్ ను ముందుకు తీసుకెళ్తుంది. ఫోటోగ్రాఫర్ గా పని చేసే విష్ణు (ఆనంద్ దేవరకొండ) పని నిమిత్తం బెంగళూరుకి బయల్దేరతాడు. మరోవైపు తులసి (మానస రాధాకృష్ణన్) తన తల్లితో కలిసి ఓ కోళ్ళ ఫామ్ లో పని చేస్తుంటుంది. తన బాస్ నుంచి లైంగిక వేధింపులు ఎదురవ్వడంతో, తులసి అక్కడి నుంచి పారిపోతుంది. అనుకోకుండా, విష్ణు ని కలుస్తుంది. మరోవైపు పోలీసులు వెతుకుతుండటంతో క్రిమినల్ దాస్ కూడా హైదరాబాద్ ని వదిలి వెళ్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. దాస్ ని విష్ణు, తులసి ఎలా కలుస్తారు? అతన్ని ఎలా ఎదుర్కుంటారు? పోలీసులు దాస్ ని పట్టుకుంటారా? అనే విషయాలను తెలియాలంటే మీరు సినిమాను చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
సినిమాలోని మూడు ప్రధాన పాత్రలు విష్ణు, తులసి, దాస్ లు ఆకట్టుకుంటాయి. ఈ పాత్రలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. సినిమా ప్రారంభమైన తొలి 20 నిమిషాల్లో ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసి దర్శకుడు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా చేశాడు. హైవే పై నడిచే ఈ కథ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. ఆనంద్ దేవరకొండ తన పాత్రలో ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. మానస రాధాకృష్ణన్ చక్కటి పాత్రతో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్ లో మానస బాగా నటించింది.
సైకో పాత్ గా అభిషేక్ బెనర్జీ అద్భుత నటనను కనబరిచాడు. విలన్ పాత్ర సినిమాకు కావాల్సిన బలాన్ని అందించింది. ఈ బాలీవుడ్ నటుడు కూడా ఘనంగా తెలుగు చిత్రసీమ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక దర్శకుడు గుహన్ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్, సీక్వెన్సెస్ తో వీక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. హత్యలు చేసే క్రమంలో విలన్ తన తెలివిని వాడే విధానాన్ని, దర్శకుడు బాగా రాసుకున్నాడు.
సాంకేతిక వర్గం:
సైమన్ కే కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాడు. తమ్మిరాజు ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేశాడు. కేవీ గుహన్ డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ గా చేశాడు. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో రిచ్‌నెస్ కనిపిస్తుంది.












