హైలైట్స్:
- టుండ్రా అనే కోడ్ నేమ్ తో గీక్బెంచ్ పై దర్శనమిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- సింగిల్ కోర్ టెస్ట్ లో 1158 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 3444 పాయింట్లు సాధించిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్

మోటోరోలా కంపెనీ రీసెంట్ గా చైనాలో మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో ని లాంచ్ చేసింది. అదే ఈవెంట్ లో మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 ఫోన్లను కూడా విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం మోటోరోలా ఎడ్జ్ 30 ప్యూజన్ యొక్క రెండర్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. డిజైన్ ని చూస్తే ఫోన్ అచ్చంగా మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో మాదిరి కనిపిస్తోంది. అంటే ఎస్30 ప్రో ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో మోటోరోలా ఎడ్జ్ 30 ప్యూజన్ అనే పేరుతో లాంచ్ కానున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్ టుండ్రా అనే కోడ్ నేమ్ తో ప్రముఖ బెచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్బెంచ్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క కీలక స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దీంతో వచ్చే నెల ఈ ఫోన్ యొక్క గ్లోబల్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చినట్లైంది. మరి గీక్ బెంచ్ లిస్టింగ్ లో ఏముందో తెలుసుకుందాం పదండి.
Motorola Edge 30 Fusion గీక్బెంచ్ లిస్టింగ్
మైస్మార్ట్ప్రైస్ వెబ్ సైట్ తొలుత మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ని గీక్ బెంచ్ పై గుర్తించడంతో పాటు జీపీయూ వివరాలను వెలికితీసింది. జాబితాను బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో రెండు జనరేషన్ల క్రితం చిప్సెట్ అయిన స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, అలాగే అడ్రోనో 660 జీపీయూ ఉండనున్నాయి. ఇదే చిప్ ని మనం మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో స్మార్ట్ ఫోన్లో కూడా చూశాం.
గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ 8జిబి ర్యామ్ ని కలిగి ఉండనుంది. ఇక బెంచ్ మార్కింగ్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సింగిల్ కోర్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ 1158 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3444 పాయింట్లను సాధించింది.
Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ కావడంతో, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని మేం అంచనా వేస్తున్నాం. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి డెప్త్ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఇవి ఇప్పటికీ కచ్చితమైన స్పెసిఫికేషన్స్ అని చెప్పలేం. కేవలం అంచనా మాత్రమేనని గుర్తించాలి. ఫోన్ రివీల్ అయ్యాకే పూర్తి ఫీచర్లు బయటకు వస్తాయి.











