హైలైట్స్:
- ఆగస్టు 15 న జరిగే ఈవెంట్ లో గ్రీనెస్ట్ ఈవీ ని లాంచ్ చేయనున్న ఓలా ఎలక్ట్రిక్
- తక్కువ ధరలో ఈ-స్కూటర్, ఓలా ఎలక్ట్రిక్ కార్, ఓలా ఎస్1 ప్రో కొత్త రంగుల వేరియంట్స్ లాంచ్ అయ్యే అవకాశం
- ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ని లాంచ్ చేసి ఆగస్టు 15 కి ఏడాది పూర్తి
ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తమ కంపెనీ నుంచి రాబోవు కొత్త ప్రోడక్ట్ ని సోషల్ మీడియా ద్వారా టీజ్ చేశారు. ఆగస్టు 15 న ఈ లాంచ్ ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఓలా ఈ-స్కూటర్ ఆగస్టు 15 తో ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇక దీని కంటే భిన్నమైన ఓ గ్రీనర్ వెహికిల్ ని లాంచ్ చేయాలని ఓలా భావిస్తోంది. ఓలా ఎస్1 ప్రో న్యూ కలర్ ఆప్షన్స్, ఓలా ఎలక్ట్రిక్ కార్ తదితర లాంచెస్ ఉంటాయని నెట్టింట్లో రూమర్లు వ్యాపిస్తున్నాయి.
On 15th August, we’ll be revealing the greenest EV we’ve made! Any guesses? ?? ? pic.twitter.com/aMFxToOSTo
— Bhavish Aggarwal (@bhash) August 7, 2022
ట్విట్టర్ ద్వారా ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ పోస్ట్ చేసిన వీడియో తో అంచనాలు పెరిగిపోయాయి. ఈ వీడియోలో పచ్చదనంతో నిండిన అడవి మధ్యలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పచ్చటి రంగులో కనిపిస్తోంది. “గ్రీనెస్ట్ స్కూటర్ మరింత గ్రీనర్ గా తయారైంది,” అంటూ భవీశ్ రాసుకొచ్చారు. ఆగస్టు 15 న జరిగే ఈవెంట్లో ఏయే లాంచెస్ ఉంటాయో గెస్ చేయాల్సిందిగా తన ఫాలోవర్లకు భవీశ్ అగర్వాల్ ఒక పోల్ ను కూడా నిర్వహించారు.
Ola S1 Pro కొత్త రంగులు, మెరుగైన రేంజ్
ఇప్పుడు లాంచ్ లో ఏవీ ఉంటాయో చూద్దాం. కొత్త రంగుల్లో ఓలా ఎస్1 ప్రో ని పరిచయం చేయవచ్చు. గ్రీన్ ఐవరీ రంగు ని తీసుకొచ్చే అవకాశముంది. గతంలో హోలీ పండుగ సందర్భంగా ఓలా గెరువా కలర్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే అది పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగింది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ ఎన్నెన్నో రంగుల ఆప్షన్స్ ను కస్టమర్లకు అందిస్తోంది.
సింగిల్ చార్జ్ పై ఓలా ఎస్1 ప్రో 181 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదని ఓలా చెబుతోంది. అయితే కొందరు అంతకంటే సుదూరం ప్రయాణించామని క్లెయిమ్ చేశారు. 200 కిలోమీటర్ల మార్కుని దాటామని చెప్పిన కస్టమర్లలో కొందరికి సీఈవో అగర్వాల్ ఉచితంగా ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ని బహూకరించడం జరిగింది. రీసెంట్ గా మూవ్ఓఎస్ 2.0 అప్డేట్ వచ్చాక, పలువురు బయ్యర్లు తాము 300 కిలోమీటర్ల మార్కుని దాటినట్లు తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ మరింత మెరుగైన, కొత్త బ్యాటరీ ప్యాక్ ని పరిచయం చేసే అవకాశముంది. ఇది భద్రతా ప్రమాణాలకు మరింత ప్రాధాన్యమిచ్చేలా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఎన్నో ఈవీ ఫైర్ ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలపై బాగా శ్రద్ధ పెడుతున్నాయి.
తక్కువ ధరలో స్కూటర్
తక్కువ ధరలో ఒక ఈ-స్కూటర్ ను లాంచ్ చేయాలని ఓలా అనుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలా మంది ఔత్సాహిక వినియోగదారులకు మేలు చేయనుంది. బడ్జెట్ సెగ్మెంట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ శక్తితో కూడిన ఎఫిషియంట్ మోటర్ తో రానుంది. అలాగే తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉండనుంది. ఎస్1 ప్రో స్కూటర్లో కనిపించిన కొన్ని ఫీచర్లను ఓలా తొలగించనుంది. ధరను తగ్గించడం కోసం ఈ మార్పులు చేయనున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్కూటర్ ని ఓలా ఎస్1 అని పిలవనుంది.
ఓలా అభివృద్ధి చేస్తున్న కొత్త బ్యాటరీ గురించి మరిన్ని వివరాలు ఈవెంట్ లో తెలిసే అవకాశముంది. అందుకోసం ఈ ఈవెంట్ ను ఓలా బాగా వాడుకోవడం ఖాయం. భవిష్యత్తులో విస్తరణ లక్ష్యాలు, సొంతంగా బ్యాటరీ ఉత్పత్తి ఆలోచనలు తదితర వాటి గురించి సీఈవో భవీశ్ జరగబోవు ఈవెంట్లో ప్రస్తావించనున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ కార్ (Ola Electric Car)
భారత మార్కెట్లో త్వరలో ఓలా ఒక ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఉంది. గతంలో ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన పలు కాన్సెప్ట్ లను ఓలా కంపెనీ టీజ్ చేస్తూ వచ్చింది. అయితే, ఆ ప్రాజెక్టు గురించి ఎక్కువగా వివరాలు ఏమీ తెలియలేదు. రోడ్లపై టెస్ట్ చేసినట్లుగా కూడా కనిపించలేదు. దీంతో ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.
మూవ్ ఓఎస్ 3.0 (MoveOS 3.0)
ప్రస్తుతం తమ ఇంజినీర్లు అభివృద్ధి చేస్తున్న మూవ్ ఓఎస్ 3.0 సాఫ్ట్‌వేర్ యొక్క గ్లిమ్స్ ని ఓలా సీఈవో ఇటీవలె చూపించారు. మూవ్ ఓఎస్ 3.0, హిల్ హోల్డ్, ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫీచర్, మూడ్స్, రీజెన్ వీ2, హైపర్ చార్జింగ్, కాలింగ్, కీ షేరింగ్ తదితర ఎన్నో ఫీచర్లతో వస్తోంది.












